. . . డాక్టర్లు లేని ఆసుపత్రుల్లో రోగుల నిలువు దోపిడి
. . . ఎలాంటి అర్హతలు లేకున్నా హాస్పిటల్స్ , మెడికల్ ల నిర్వాహణ
. . . చోద్యం చూస్తున్న వైద్య ఆరోగ్యశాఖ . . . డ్రగ్ కంట్రోల్ అధికారులు
నిజామాబాద్, బతుకమ్మ :
వైద్యో నారాయణో హరి అని డాక్టర్లను దేవుడిగా కొలిచే కల్చర్ మనది. ఎందుకంటే తల్లి గర్భంలో జన్మించిన వ్యక్తికి పునర్జన్మ ప్రసాదించింది వైద్యుడే కాబట్టి మన పూర్వీకులు వైద్యుడిని నారాయణుడిగా కొలిచారు. ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఉన్న వైద్యం ద్వారా సేవలు చేసే అర్హత కొందరికే ఉంటుంది. గతంలో ఆయుర్వేద వైద్యం ప్రాచీన వైద్యంగా పేరు గాంచగా తర్వాత కాలంలో యూనాని, అలోపతి (ఇంగ్లీష్) వైద్యం చాలా మందికి ఎలాంటి రోగాన్నైనా నయం చేస్తుందని ప్రధానంగా అలోపతి వైద్యంతో సాధ్యం కానిది లేదనే నానుడి ఉంది. కేవలం మరణాన్నిఆపలేని శక్తిగా మాత్రమే ఇంగ్లీష్ వైద్యానికి పేరు. మిగిలిన ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఉన్న రోగికైనా వైద్యం చేయడం అలోపతికే దక్కింది. అలోపతి వైద్యానికి ఎంబీబీఎస్ పునాది కాగా దాని తర్వాత పీజీలు చేసే స్పెషలైజేషన్ ద్వారా వైద్యులు ఆయా రంగాల్లో నిష్ణాతులుగా ఎదుగడం సహజం. కానీ కొందరు శంకర్ దాదా ఎంబీబీఎస్ లగా ఫేక్ డిగ్రీలతో వైద్యం చేసిన సంఘటనలు కొకొల్లాలు. వైద్య మండలి ఎన్నిసార్లు కొరడా ఝళిపించిన ఎక్కడా ఒకచోటా ఫేక్ డాక్టర్ల బాగోతాలు బట్టబయలవుతున్నాయి. కానీ ఇప్పుడు కొందరు ఏకంగా ఎంబీబీఎస్ సర్టిఫికెట్లను అద్దెకు తీసుకుని ఆసుపత్రులను ఏర్పాటు చేసేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు కామారెడ్డి జిల్లా కేంద్రంలోనూ మారుమూల ప్రాంతాల్లోనూ వైద్యం అందుబాటులోకి వచ్చింది. అయితే అక్కడ అద్దె సర్టిఫికెట్లతో మెడికల్ ను ఏర్పాటు చేసిన మాదిరిగానే ప్రైవేట్ ఆసుపత్రుల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. సంబంధిత ఆసుపత్రికి ఎవరు వైద్యుడు అంటే కేవలం ఆసుపత్రి పేరు మినహా అక్కడ ఏ వైద్యుడు ఏ రంగంలో నిష్ణాతుడు వైద్య సేవలందిస్తున్నాడని తెలియని పరిస్థితి దాపురించింది.

అద్దె సర్టిఫికెట్లతో ఏర్పాటు చేసిన ఆసుపత్రుల్లో రోగికి చేటుగా మారాయి. ఎందుకంటే వైద్యులు కానీ వారు కేవలం లాభాపేక్షతో ఆసుపత్రులను ఏర్పాటు చేయడంతో అందులో వైద్యం నాసీరకమే కాకుండా అక్కర్లేని వైద్యం చేస్తున్నారని చెప్పాలి. ఎంబీబీఎస్, ఎండీలు, ఎంఎస్ లను విద్యార్హాత కలిగిన డాక్టర్లను తమ ఆసుపత్రుల్లో అగ్రిమెంట్ కింద నియమించుకున్న వ్యక్తులు వారితో రోగుల దోపిడిని నడిపించడం విశేషం. అద్దె సర్టిఫికెట్లతో మెడికల్ లను, ఆసుపత్రులను ఏర్పాటు చేసిన కొందరు మాఫియా లాగా అవతారం ఎత్తారు. ప్రైవేట్ ప్రాక్టిషినర్లకు ఒప్పందం చేసుకుని రోగులను, ఆసుపత్రులకు రిఫర్ గా తరలించి నిలువు దోపిడి చేస్తున్నారు. అక్కర్లేని టెస్టులు, స్కానింగ్ లు ఏకంగ సర్జరీలకు వెనుకాడడం లేదన్నది జగమెరిగిన సత్యం. కొందరు ఆర్ ఎంపీలు కూడా ఆసుపత్రులలో భాగస్వామ్యులు(పార్టనర్)గా చెలామణి అవుతూ దోపిడిలో భాగస్వామ్యం అవుతున్నారు. ఇప్పుడు ఎండీ న్యూరో, ఫిజిషియన్ అర్హత కలిగిన డాక్టర్లు ఏడాదిపాటు కలిగి ఉంటే కోట్లు వెనుకేసుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. డాక్టర్లుగా పీజీలు చదివిన వారు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పని చేస్తున్న వారు ప్రైవేట్ ఆసుపత్రులు ఏర్పాటు చేసిన యజమాన్యం చెప్పిన విధంగానే ట్రీట్ మెంట్ చేస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమే.
రోగి ఆసుపత్రికి రిఫర్ గా వచ్చిందంటే దోపిడిని కొనితెచ్చుకున్నట్లే. ఆర్ ఎంపీ, పీఎంపీలు మొదలుకుని ఇతర వైద్యులు రిఫర్ చేసిన వారికి వచ్చిన బిల్లులో చెరిసగం పంచుకునే కల్చర్ కొనసాగుతుంది. ఆసుపత్రికి వచ్చిన రోగిని పరీక్షించకుండానే అడ్డమైన టెస్టులు చేయడం పరిపాటిగా మారింది. అదిచాలదని అందులో రోగ నిర్ధారణ కాలేదని, స్కానింగ్ లతో పాటు ఎంఆర్ఐ వరకు పరీక్షలు నిర్వహించేస్తున్నారు. చివరకు మందుల చీట్టీలో రాసే మెడిసిన్ ఇతర మెడికల్ లో దొరకవని, కనీసం పది శాతం డిస్కౌంట్ ఇవ్వకుండా దోచేస్తున్నారు. ఇప్పుడు సాధారణంగా ఎంబీబీఎస్ పై స్థాయి వైద్యుడి వద్ద జ్వరం వచ్చిన కనీసం 2 నుంచి 3 వేల చేతి చమురు వదులాల్సిందే. వైద్యం చేసుకోకముందే సహజ సిద్దంగా కొందరు తమ ఇంటి వద్దనే సొంత వైద్యం చేసుకుని తీరా ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చిన తర్వాత టెస్టులు, స్కానింగ్ లలో వచ్చిన రిపోర్టులతో రోగ నిర్ధారణ జరిగిన తర్వాత అందించే వైద్యంతో, జబ్బు తగ్గిందని అనుకునే లోపే రోగి వద్ద అందినకాడికి దంచుకునే కల్చర్ అద్దె వైద్యులు ఉన్న ఆసుపత్రుల్లో కొనసాగుతుంది. చాలామట్టుకు వైద్యం వికటించిన ఘటనలు కేవలం అద్దె ఆసుపత్రుల్లో ఎక్కవనే సంగతి తెలిసిందే. ప్రధానంగా ప్రతీయేటా ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేసి వైద్యులు ఉన్నారా, వారే ఆసుపత్రులు నడుపుతున్నారా అనే విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ విస్మరించిందనే వాదనలున్నాయి. కాదు కాదు ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహిస్తున్న యజమాన్యాలతో కుమ్మకై అద్దె సర్టిపికెట్లతో హాస్పిటళ్లు ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలున్నాయి.

