. . . జిల్లా ఎస్పీ డి.జానకి సమీక్ష
మహబుబ్ నగర్, బతుకమ్మ :
మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి గ్రామంలోని అమర రాజా గిగా కారిడార్‌లో ఏర్పాటు చేసిన సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభోత్సవం, ప్లాంట్ సందర్శన, సమావేశ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొననున్న నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి జిల్లా ఎస్పీ డి.జానకి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. సీఎం హెలికాప్టర్ దిగనున్న హెలిప్యాడ్, ప్రారంభోత్సవ వేదిక, సమావేశ ప్రాంగణం, వీఐపీ రాకపోకల మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలను ఆమె క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ సమగ్ర బ్రీఫింగ్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన బాధ్యతలను అప్రమత్తతతో, సమన్వయంతో నిర్వర్తించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, అమర రాజా సంస్థ ప్రారంభోత్సవం ప్రతిష్ఠాత్మక కార్యక్రమం కావడంతో భద్రతా పరంగా ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా విధులు నిర్వహించాలని సూచించారు. వీఐపీ రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ నిర్వహణ, ప్రవేశ – నిష్క్రమణ మార్గాలు, సమావేశ ప్రాంగణం వద్ద విధులు నిర్వహించే సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేసి కార్యక్రమం ప్రశాంతంగా, విజయవంతంగా జరిగేలా చూడాలని తెలిపారు. విధుల్లో ఉన్న ప్రతి పోలీసు అధికారి ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని ఎస్పీ సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన బందోబస్తు కోసం మొత్తం 450 మంది పోలీసు సిబ్బందిని నియమించారు. ఇందులో జిల్లా ఎస్పీ, ఒక అదనపు ఎస్పీ, నలుగురు డీఎస్పీలు, 17 మంది ఇన్‌స్పెక్టర్లు, 37 మంది ఎస్‌ఐలు, 86 మంది ఏఎస్‌ఐలు/హెడ్ కానిస్టేబుళ్లు, 286 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 18 మంది హోంగార్డులు ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి భద్రతా ఏర్పాట్లను పటిష్టంగా అమలు చేయాలని జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశించారు.

