నిజామాబాద్, బతుకమ్మ: బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు చేయిస్తూ కాంగ్రెస్ నాయకులు వేధిస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజల్లో నుంచి వ్యతిరేకత పెరిగిందని, సీఎం రేవంత్ గ్రాఫ్ పడిపోయినట్లు సర్వేలు చెబుతున్నాయన్నారు. ఆరు గ్యారెంటీలు, 13 హామీలపై ప్రజలు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను, నాయకులను నిలదీయాలని సూచించారు. దీక్షా దివస్ ఘనంగా నిర్వహించాలని, కాంగ్రెస్ పతనానికి ఇదే నాంది కావాలన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని పిలుపునిచ్చారు.
