. . . సర్పంచ్ ధర్మరాజు యాదవ్ పంచిత
సిరికొండ, బతుకమ్మ :
గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురిసి అధిక దిగుబడులు రావాలని సిరికొండ సర్పంచ్ ధర్మరాజు యాదవ్ పంచిత కోరారు. ప్రకృతి మాత అనుగ్రహం గ్రామ రైతులందరిపై ఉండాలని ప్రార్థిస్తూ సిరికొండ గ్రామ రైతులు అనాదిగా వస్తున్న సంప్రదాయ వేడుకను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ ఆచారం ప్రకారం వడగండ్ల వానలను అరికట్టేందుకు నాగలిని భూమిలో పాతే ప్రాచీన సంప్రదాయాన్ని రైతులు పాటించారు. పంట పూర్తిగా చేతికొచ్చి, అమ్మకాలు ముగిసిన అనంతరం నాగలిని తిరిగి పైకి లేపి, ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయ పద్ధతిలో భాగంగా మేకపోతును బలిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ రైతులంతా కలిసి సంబరాలు జరుపుకొని ఆనందోత్సాహాలతో వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, యువకులు, పాలకవర్గ సభ్యులు, సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొని వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గ్రామ సంప్రదాయాలు, వ్యవసాయ సంస్కృతిని పరిరక్షిస్తూ ప్రతి సంవత్సరం ఈ వేడుకను నిర్వహించడం సిరికొండ గ్రామ ప్రత్యేకతగా నిలుస్తుందని గ్రామ పెద్దలు తెలిపారు.

