- వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై సమీక్షలో కలెక్టర్ వెల్లడి
నిజామాబాద్, బతుకమ్మ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగేలా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి వైద్యాధికారులకు సూచించారు. ఈ విషయమై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పనితీరులో స్పష్టమైన మార్పు రావాల్సిందేనని స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం జిల్లా వైద్యారోగ్య శాఖ పనితీరుపై కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష జరిపారు. పీ.హెచ్.సీలు, సీ.హెచ్.సీలు,. హెల్త్ సబ్ సెంటర్ల వారీగా వాటి పనితీరును సమీక్షించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇదివరకటితో పోలిస్తే ప్రసవాల రేటు క్రమేణా తగ్గుతూ వస్తోందని అన్నారు. గర్భిణీ మహిళల వివరాల నమోదు పూర్తి స్థాయిలో జరగాలని, వారికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిగేలా పర్యవేక్షణ చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఇటీవలి కాలంలో సిజేరియన్ ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతున్నట్లు గణాంకాల ద్వారా వెల్లడి అవుతోందని, అత్యవసరం అయితే తప్ప సిజేరియన్ చేయకూడదని, మహిళల దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా సాధారణ ప్రసవాల కోసం పూర్తి స్థాయిలో కృషి. చేయాలని హితవు పలికారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ కాన్పులు చేస్తారని, మెరుగైన వైద్యం అందుతుందని ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేలా సంతృప్తికర సేవలు అందించాలని అన్నారు. సి.సెక్షన్ లు ఎక్కువగా జరుగుతున్న ప్రైవేటు నర్సింగ్ హోమ్ లు, ఆసుపత్రుల పై కూడా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రసవాలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరిగేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, వైద్యాధికారులు, ఆయా విభాగాల సిబ్బంది సమిష్టిగా, సమన్వయంతో పనిచేస్తూ సత్ఫలితాలు సాధించాలని సూచించారు. క్రమం తప్పకుండా తాను ప్రగతిని సమీక్షిస్తానని కలెక్టర్ స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ నూటికి నూరు శాతం జరగాలని, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా విధులు నిర్వర్తిస్తూ, పనితీరు మెరుగు పరచుకోవాలని అన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. కాగా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్ల నూతన భవన నిర్మాణాల స్థితిగతులు, పనుల పురోగతి, వైద్యులు, సిబ్బంది ఖాళీలు, సమకూర్చాల్సిన సదుపాయాలపై కలెక్టర్ చర్చించి పలు సూచనలు చేశారు. సమీక్షలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ, వివిధ విభాగాల వైద్యాధికారులు, ఇంజినీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.

