28.1 C
Hyderabad

కాళేశ్వరం మోటార్లు వెంటనే ఆన్ చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీశ్ రావు లేఖ

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లను సకాలంలో నింపి రైతులకు సాగునీరు అందించేందుకు మోటార్లను వెంటనే ఆన్ చేసి నీటి పంపింగ్ ప్రారంభించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా రాజకీయాలకు అతీతంగా నిర్ణయం తీసుకుని నీటి పంపింగ్ చేపట్టాలని ఆయన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత వానాకాలం సాగు సీజన్‌లో ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, మరోవైపు ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటిని సకాలంలో నింపకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. పంటల సాగు ముందుకు సాగేందుకు అవసరమైన సాగునీటి కోసం రైతులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మిడ్ మానేరు రిజర్వాయర్ నుంచి మోటార్లను ఆన్ చేసి నీటిని పంపింగ్ చేయాలని ఆయన కోరారు. మిడ్ మానేరు పూర్తి నీటి సామర్థ్యం 27 టీఎంసీలు కాగా, ప్రస్తుతం సుమారు 22 టీఎంసీల నీటి లభ్యత ఉందని లేఖలో పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో వరద నీటి లభ్యత కూడా ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకుంటూ కాళేశ్వరం ప్రాజెక్టు పంపులను వెంటనే ప్రారంభించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. అన్నపూర్ణ (అంతగిరి), రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, నృసింహ (బస్వాపూర్) తదితర రిజర్వాయర్లను నింపడంతో పాటు వాటి పరిధిలోని చెరువులు, చెక్‌డ్యామ్‌లను కూడా నింపాలని కోరారు. ఈ రిజర్వాయర్ల ద్వారా సుమారు 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం ఉన్నందున, రైతుల ప్రయోజనాల కోసం ఎలాంటి జాప్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా లోయర్ మానేరు డ్యామ్‌ (ఎల్‌ఎండీ) పూర్తి నీటి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా, ప్రస్తుతం సుమారు 6.9 టీఎంసీల నీటి లభ్యత ఉందని హరీశ్ రావు తెలిపారు. మిడ్ మానేరు నుంచి ఎల్‌ఎండీకి నీటిని తరలించి, ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజ్-2 పరిధిలోని అవసరమైన ఆయకట్టుకు సాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశారు. గత యాసంగి సీజన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టులోని పై రిజర్వాయర్ల ఆయకట్టు పరిధిలో సుమారు 4 లక్షల ఎకరాల్లో సాగు జరిగిందని హరీశ్ రావు గుర్తు చేశారు. ఈ వానాకాలంతో పాటు వచ్చే యాసంగి పంటకు కూడా సాగునీరు అందేలా కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లను నింపాలని కోరారు. రిజర్వాయర్లకు అనుసంధానంగా ఉన్న కాలువలు, చెరువులు, చెక్‌డ్యామ్‌లను కూడా నీటితో నింపి రైతుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించాలని హరీశ్ రావు తన లేఖలో పేర్కొన్నారు. రైతుల సాగు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాజకీయాలకు అతీతంగా తక్షణమే నీటి పంపింగ్ ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.

More articles

Latest article