27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సరిపడా లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లను ఉపేక్షించరాదు

 

. . . ప్రతి రైస్‌మిల్లు వద్ద ఒక బాధ్యతాయుతమైన అధికారిని నియమించి పర్యవేక్షించాలి

 

. . . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

మిషన్ మోడ్‌లో పనిచేస్తూ రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కలెక్టర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తేనే సమస్యలు తలెత్తవని, ఏ సమస్య వచ్చినా కలెక్టర్లు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. మంగళవారం రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ, పురోగతిపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వివిధ జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వివిధ జిల్లాల్లో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో తలెత్తిన ఇబ్బందులు, సమస్యలపై కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాలని కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించాలన్నారు. గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోడౌన్లకు తరలించాలని, ధాన్యం లోడ్ తరలించేందుకు ఒప్పందం మేరకు సరిపడా లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లను ఉపేక్షించరాదన్నారు. అవసరమైతే అలాంటి వారిపై క్రిమినల్ కేసులకూ వెనకాడొద్దని, ధాన్యం లోడింగ్‌ విషయంలో జాప్యం జరగకుండా స్థానికంగా ఉన్న హమాలీలను గుర్తించి వారితో పని చేయించుకోవాలని, ధాన్యం లోడ్ చేసిన వెంటనే రైతులకు రశీదు అందేలా చర్యలు తీసుకోవాలని, అలా చేయడం వల్ల తాలు, తరుగు పేరుతో అక్రమాలు జరగకుండా చూడొచ్చని చెప్పారు. లారీల కొరత ఉంటే దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ట్రాక్టర్లు, ఇతర వాహనాలను వినియోగించాలని, ధాన్యం తరలించడానికి అవసరమైన వాహనాలను అందుబాటులో ఉండేలా చూడాలని ఈ సందర్భంగా రవాణా శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. “పలు ప్రాంతాల్లో గోదాముల సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటి ప్రాంతాల్లో అవసరాన్నిబట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలి. గోడౌన్స్ సమస్య ఉన్న ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలి. అవసరమైన చోట రైతుబజార్లు, ఫంక్షన్ హాళ్లను అందుబాటులోకి తీసుకుని ధాన్యాన్ని తరలించాలి. వెసులుబాటు ఆధారంగా అక్కడినుంచి గోడౌన్లకు తరలించేలా ప్రణాళికలుండాలి” అని సూచించారు. ప్రాంతాల వారిగా సమస్య తీవ్రతను గుర్తించి జిల్లా కలెక్టర్లు సరైన చర్యలు తీసుకోవాలని, ప్రతి అధికారి జవాబుదారితనంతో వ్యవహరించాల్సిందేనని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహించే అధికారులు, కలెక్టర్లపై చర్యలకు ప్రభుత్వం వెనకాడదని హెచ్చరించారు. మొక్కజొన్న పంట ఎక్కువగా వచ్చే జిల్లాల కలెక్టర్లు కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలగొద్దు. అవసరమైన చోట పోలీస్ సహాయం తీసుకుని కలెక్టర్లు ధాన్యం సేకరణ సాఫీగా జరిగేలా చూడాలని ఆదేశించారు. అకాల వర్షాల సమయంలో రైతులకు నష్టం జరగకుండా శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఇలాంటి సమయాల్లో ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లను రైతులకు అందుబాటులో ఉంచాలి. వాతావరణ శాఖ సూచనల ఆధారంగా ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేసేందుకు మండల స్థాయిలో ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. వాతావరణ సూచనలను రైతులకు చేరవేసేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతీ ఐకేపీ సెంటర్‌కు ఒక అధికారిని నియమించాలి. ప్రతి రైస్‌మిల్లు వద్ద ఒక బాధ్యతాయుతమైన అధికారిని నియమించి పర్యవేక్షించాలి” అని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ధనసరి అనసూయ సీతక్క, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు తో పాటు అధికారులు పాల్గొన్నారు.

 

The grain procurement process should be completed expeditiously.

More articles

Latest article