. . . సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఏ.రమేష్ బాబు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులకు గుడ్లను ప్రభుత్వమే నేరుగా సరఫరా చేయాలని, లేదంటే గుడ్డు ధరకు ప్రభుత్వం చెల్లిస్తున్న మొత్తాన్ని పెంచాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఏ.రమేష్ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్న భోజన ఏజెన్సీ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కార్మికులు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి, అనంతరం డీఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఒక్కో గుడ్డుకు రూ.6 మాత్రమే చెల్లిస్తుండగా మార్కెట్లో గుడ్డు ధర రూ.8 నుంచి రూ.9 వరకు ఉందన్నారు. దీంతో ప్రతి విద్యార్థికి గుడ్డు అందించేందుకు కార్మికులు తమ సొంత డబ్బు నుంచి అదనంగా రూ.2 నుంచి రూ.3 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని చెప్పారు. వారానికి మూడు రోజులు గుడ్లు అందించాల్సి ఉండటంతో అప్పులు చేసి గుడ్లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వమే మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన గుడ్లను నేరుగా సరఫరా చేయాలని, అది సాధ్యం కాకపోతే గుడ్డుకు చెల్లించే మొత్తాన్ని మార్కెట్ ధరకు అనుగుణంగా పెంచాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు వారానికి ఒక రోజు గుడ్డు స్థానంలో అరటిపండు అందించేందుకు అనుమతించాలని కోరారు. అదేవిధంగా పలు మండలాల్లో పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని, మధ్యాహ్న భోజన పథకం మెనూ ధరలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులకు నెలకు కనీసం రూ.26 వేలు వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా కార్మికులకు ఇప్పటికీ కేవలం రూ.2 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని విమర్శించారు. ఈ వేతనం కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోవడం లేదని, కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం వస్తోందని, అలాంటి నిర్ణయం కార్మికుల ఉపాధికి తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు. కార్మికుల జీవనోపాధికి భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మిక సంఘం (సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు చామంతి లక్ష్మి, జిల్లా నాయకులు హరిశంకర్, సుజాత, పర్వవ, సావిత్రి, గిరీష్, శ్రీనివాస్‌తో పాటు వివిధ మండలాలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు.

