27.3 C
Hyderabad
Friday, July 31, 2026

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జూలై 18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు

 

. . . బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేసిన ప్రభుత్వంగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందని ఆయన విమర్శించారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాసంలో గురువారం హైదరాబాద్ నగరానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులతో కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సగం పదవీకాలం పూర్తికాకముందే తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోందని అన్నారు. ఆడబిడ్డల నుంచి అన్నదాతల వరకు, విద్యార్థుల నుంచి నిరుద్యోగ యువత వరకు ఏ ఒక్క వర్గానికి ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని కేటీఆర్ విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి అవినీతి, స్కామ్‌లు, అక్రమాలు, అరాచకాలతో పాలన సాగుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, విధానాలు ప్రజా వ్యతిరేకంగా మారాయని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి చేయించిన సర్వేలోనూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత బయటపడిందని పేర్కొన్నారు. ప్రభుత్వం కాలం ముగుస్తోందనే భయంతోనే ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, రైతులు సాగునీటి కోసం ఆందోళన చెందుతున్న సమయంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచాయని కేటీఆర్ అన్నారు. రైతులకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం వారిని ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. యువత, నిరుద్యోగుల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని కేటీఆర్ అన్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన ‘యూత్ డిక్లరేషన్’లోని హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత ఈ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తోందని కేటీఆర్ చెప్పారు. వరంగల్ రైతు సభ తర్వాత, జూలై 18న హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో యువత, విద్యార్థులతో భారీ స్థాయిలో ‘యువ సంగ్రామ సదస్సు’ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. యువజన సదస్సుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని, వాటిని ఎదుర్కొనేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. హైదరాబాద్‌తో పాటు పరిసర అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో యువత సభకు హాజరవుతారని పార్టీ నేతలు వివరించారు. సదస్సును విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

 

The Congress government has lost the people's trust.

More articles

Latest article