. పార్టీ ఫిరాయించిన వారిలో జిల్లాకు చెందిన పోచారం శ్రీనివాస్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం ఏడుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. సుప్రీం నోటీసులు ఇచ్చిన వారిలో ఉమ్మడి జిల్లాలోని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితోపాటు రాష్ర్టంలోని ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, అరికెపూడి గాంధీ, కాలే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, క్రిష్ణ మోహన్ రెడ్డి ఉన్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై దాఖలైన అనర్హత పిటిషన్ తో కలిపి దీనిని విచారిస్తామని సుప్రీం పేర్కొంటూ ఈనెల 10వ తేదీ వాయిదా వేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
