. కాంగ్రెస్ లో చేరేందుకు బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రయత్నాలు
. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన నేత
. తప్పుడు సంకేతాలు వెళ్తాయి.. పార్టీలో చేర్చుకోవద్దన్న ఆ ఎమ్మెల్యే
. దందాలు కాపాడుకునేందుకు బీజేపీ నేత విశ్వ ప్రయత్నాలు
వ్యాపారం, రాజకీయం రెండు కళ్లలా భావించే ఆ నాయకుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే అటువైపు వెళ్లడం మామూలు విషయంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓ జాతీయ పార్టీ నుంచి టికెట్ సాధించిన సదరు నాయకుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తన రెండు కళ్లు(వ్యాపారం, రాజకీయం) సరిగా పని చేయాలంటే అధికార పార్టీ వైపు వెళ్లాలని భావించిన నాయకుడు.. స్థానిక ఎమ్మెల్యే, నాయకులను సంప్రదించకుండానే ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే ఆ నాయకుడిని పార్టీలోకి చేర్చుకోవద్దని జిల్లా కాంగ్రెస్ ముఖ్యులతోపాటు ఎమ్మెల్యే ఖరాఖండిగా తేల్చి చెప్పడం చర్చకు దారితీసింది.
నిజామాబాద్, బతుకమ్మ : అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి కాంగ్రెస్ లో చేరేందుకు పావులు కదుపుతున్నారు. జిల్లా కాంగ్రెస్ నేతలతో సంబంధం లేకుండానే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. జిల్లా నేతలను అడగకుండా ఆ బీజేపీ లీడర్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవద్దని స్థానిక ఎమ్మెల్యే అడ్డుకోవడంతో ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశమైంది. రాజకీయంతోపాటు వ్యాపారం చేసే సదరు నాయకుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటకాగడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటికే మూడు పార్టీలు మారిన సదరు నేత ముచ్చటగా నాలుగోసారి అధికార కాంగ్రెస్ వైపు వెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీలో ఉంటూనే తన వాణిజ్య సంబంధాలను, వ్యాపార లావాదేవీలను చక్కబెట్టుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆయన ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి వత్తాసు పలకడం దందాలు చేసుకోవడం రాజకీయంగా లబ్ధి పొందడం ఆయనకు తెలిసినంతగా జిల్లాలో మరి ఎవరికీ తెలియని రాజకీయ నాయకులు పేర్కొంటున్నారు. జిల్లాలో వ్యాపారం, రాజకీయాలను సమాంతరంగా నడుపుతున్న ఆ నాయకుడు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీని కాదని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయడమే కాకుండా తనపై ఆనాడు అధికార పార్టీ మోపిన అవినీతి అక్రమ నిందల నుంచి కాపాడుకునేందుకు ఏకంగా బీఆర్ఎస్ పైనే తిరుగుబాటు జెండా ఎగురవేశారు. పేరుకు పోటీ చేశాడు కానీ గెలుపు కోసం ప్రయత్నాలు చేయలేదనే విమర్శలను మూటగట్టుకున్నాడు. అక్కడ స్థానిక నేత కచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడని తెలిసి పోటీ చేసి మమ అనిపించాడనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా పై పెత్తనం చేస్తుండడంతో ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కలిసి పార్టీలో చేరేందుకు ప్రయత్నించాడు అయితే జిల్లా అధ్యక్షుడికి కానీ, స్థానిక ఎమ్మెల్యేకు కానీ ఈ సమాచారం లేకపోవడంతో వారు సదరు నేతను పార్టీలో చేర్చుకోవద్దని సీఎంకు తేల్చిచెప్పినట్లు తెలిసింది. సదరు నాయకుడు కేవలం తన వ్యాపారం, గతంలో తనపై నమోదైన అవినీతి అక్రమాల కేసుల నుంచి బయటపడేందుకే కాంగ్రెస్ లో చేరుతున్నారని సీఎంకు తెలపడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.