- శారీరకంగా, మానసికంగా క్షోభకు గురి కావద్దు
- జిల్లా జడ్జి కుంచాల సునీత
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు.. అయితే, పని ప్రదేశంలో స్త్రీలపై లైంగిక వేధింపులు పెరుగుతుండటం వారి ప్రగతికి ప్రతిబంధకంగా మారుతోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీతా కుంచాల అన్నారు. నగరంలోని పోలిస్ పరేడ్ మైదానంలో గురువారం మహిళలు పనిచేసే చోట జరుగుతున్న లైంగిక వేధింపుల పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వేధింపులు, దాడులు మహిళల్లో అభద్రతను పెంచి పోటీ ప్రపంచంలో వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయని, శారీరకంగా, మానసికంగా వారిని క్షోభకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు.

స్త్రీలపై అత్యాచారానికి పాల్పడినా, శారీరక సంబంధం పెట్టుకొమ్మని బలవంతం చేసినా, వారితో అశ్లీల పదజాలం వాడినా, అశ్లీలంగా ఎటువంటి సైగలు చేసినా, అశ్లీల చిత్రాలు తీసినా, చూపించినా, శారీరకంగా గాని మానసికంగా గాని వారిని ఎటువంటి లైంగిక ఇబ్బందులకు గురిచేసినా అవి లైంగిక వేధింపుల క్రిందికి వస్తాయని పేర్కొన్నారు. ఏదైనా ప్రభుత్వ కార్యాలయం, ప్రభుత్వరంగ సంస్థ, ప్రైవేటు సంస్థ, ప్రభుత్వ, పైవేటు కర్మాగారం, విద్యాసంస్థ, ప్రభుత్వ, ప్రైవేటు అనుబంధ సంస్థ, సొసైటీ, ట్రస్టు, ఎన్‌జివో, సేవలందించే సంస్థ, ఆసుపత్రి లలో మహిళపై లైంగికంగా వేధిస్తే వెంటనే స్థానిక పోలిస్ స్టేషన్ లో లేదా షీ టీమ్,భరోసా కేంద్రాలలో ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళలు పని చేసే చోటు లైంగిక వేధింపులకు గురికాకుండా అందుకు సంబంధించిన పని పరిశ్రమలు లేదా కార్యాలయంలో కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. పని చేసే చోటు మహిళలకు లైంగిక వేధింపులకు గురి చేసినట్లయితే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంటాయని తెలిపారు.

