కామారెడ్డి, బతుకమ్మ : ఆదివాసి కార్పొరేటర్ సుజాతను అవమానించే పద్ధతిలో మాట్లాడితో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి చైర్మన్ రాణా ప్రతాప్ రాథోడ్ నాయక్, లంబాడా హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నునావత్ గణేష్ నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా, సుధీర్ రెడ్డి చేసిన తప్పులకు వ్యతిరేకంగా అన్ని రకాలుగా కొట్లాడుతామని అన్నారు. సుజాత కుటుంబానికి అండగా నిలబడతామని తెలిపారు. ఒకవైపు రాజ్యాంగపరంగా కొట్లాడుతూనే రెండోవైపు సుధీర్ రెడ్డిని రాజకీయ సమాధి చేస్తామని స్పష్టం చేశారు. సుధీర్ రెడ్డి లాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడని, కుల అహంభావంతో, స్త్రీల పట్ల చులకన భావంతో, మగ దురహంకారంతో వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి చట్టసభల్లో ఉండడానికి అర్హుడు కాదని , వెంటనే అతన్ని చట్టసభలను తొలగించాలని డిమాండ్ చేశారు. సుధీర్ రెడ్డి కి ఏ మాత్రం నైతిక విలువలు ఉన్న వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, రాజ్యాంగ మీద ఆయన చేసిన ప్రమాణానికి ఆయన కట్టుబడి లేడని తెలిపారు. ఎల్బీనగర్ ప్రజలు, రాష్ట్ర గిరిజనులు ఈ సంఘటన పట్ల స్పందించి సుజాత కుటుంబానికి ఆదివాసీ గిరిజన బంజారా లంబాడా సంఘంలు పూర్తిగా అండగా ఉంటామని తెలిపారు. త్వరలోనే జాతీయ ఎస్టీ కమిషన్ కు ఢిల్లీకి వెళ్లి కలుస్తామని అన్ని రాజ్యాంగబద్ధ సంస్థల్లో సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శంకర్ నాయక్, బద్రి నాయక్, లాలూ నాయక్, సతీష్ నాయక్, గిరిజన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
