. . . ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ
కామారెడ్డి, బతుకమ్మ :
తాను పోటీ చేసిన సమయాల్లో మాదిగలు అండగా నిలిచారని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఎస్సి వర్గీకరణ తక్షణమే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈఎస్ఆర్ గార్డెన్ లో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల మాదిగల ధర్మయుద్ద మహాసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం ఎస్సి వర్గీకరణ సాధించుకున్న దాని అమలు కోసం మళ్ళీ పోరాటం చేయాల్సి వస్తుందన్నారు. వర్గీకరణ అమలు కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాల వర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కుట్ర చేస్తున్నారని, వారికి ప్రభుత్వం వత్తాసు పలుకుతుందని ఆరోపించారు. 2004 లో ఎస్సి వర్గీకరణ సుప్రీంకోర్టు రద్దు చేసిన 24 గంటల్లోనే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసిందని, నేడు అదే సుప్రీంకోర్టు ఎస్సి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇస్తే 3 నెలలైనా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. నాడు అంబెడ్కర్ కాలంలో రిజర్వేషన్ల కోసం పోరాటం జరిగిందని నేటి కాలంలో రిజర్వేషన్ల పంపకాల కోసం పోరాటం జరుగుతుందన్నారు. తాను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదని, తన మెడలో కండువా ఎప్పటికి మారదని స్పష్టం చేశారు. 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్సి వర్గీకరణ అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు ఆగస్ట్ 1 న అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి తీర్పును స్వాగతించడమే కాకుండా దేశంలోనే తెలంగాణలో తామే ముందుగా వర్గీకరణ అమలు చేస్తామని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఉద్యోగాల నియామకాల్లో వర్గీకరణ అమలు చేస్తామని చెప్పిన సీఎం అక్టోబర్ లో వర్గీకరణ అమలు చేయకుండా ఉద్యోగాల నియామకాలు చేపట్టారని, ఫలితంగా మాధిగలు ఉద్యోగాలు కోల్పోయారన్నారు. 1996 లో నాటి సీఎం చంద్రబాబు నాయుడు ఎస్సి వర్గీకరణ అమలు చేయడం వల్లనే ఇప్పుడున్న మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులకు అవకాశం లభించిందన్నారు. నాటి తొలి దళిత మాల సామాజిక వర్గానికి చెందిన సీఎం దామోదర సంజీవయ్య నాడు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షునిగా ఉన్నారని, నేడు కర్ణాటకకు చెందిన అదే సామాజిక వర్గానికి చెందిన ఖర్గే ఉన్నారని, దీనిని బట్టి మాలలకు కాంగ్రెస్ పార్టీ ఎంత మద్దతు ఇస్తుందో స్పష్టం అవుతుందన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎస్సి వర్గీకరణ కోసం అనేక కమిషన్లు వేసాయని, ఆ కమీషన్ల నిర్ణయాన్ని మాత్రం అమలు చేయలేదన్నారు. వర్గీకరణ అమలు కోసం ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని, రెండు మూడు నెలలు పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 59 కులాల ఆస్తి ఒకరే ఒకరికి కావాలంటే అది న్యాయమా, సమానత్వమా అని 59 కులాలకు వాటా అందించాలని ఆనాటి అంబేద్కర్ కల అని, ఆ కాలంలో నిజం చేయాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. త్వరలో ఏ నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయం కట్టుబడి ఉండాలని మాదిగలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కామారెడ్డి ఇంచార్జ్ మైలారం బాలు ఎమ్మార్పీఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి బట్ట వెంకట రాములు సత్తిగాడి లక్ష్మి, జిల్లా సీనియర్ నాయకులు కుంటోళ్ల యాదయ్య సామెల్ నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు ప్రమోద్ పోశెట్టి పురుషోత్తం బాలరాజు పద్మారావు లావణ్య బట్ట రమేష్ కొంగల భూమేష్ రాజ నరసయ్య యాదయ్య టీచర్ తదితరులు పాల్గొన్నారు.
