నిజామాబాద్ సిటి, బతుకమ్మ :
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొని, సత్యసాయి బాబా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. భగవాన్ సత్యసాయి బాబా జీవిత విశేషాలు, బోధనలు, సేవా నిరతిని గుర్తు చేసుకున్నారు. వేడుకల సందర్భంగా సత్యసాయి బాబా సేవా సమితి ప్రతినిధులు భక్తి గీతాలు ఆలపించారు. సత్యసాయి ప్రబోధనలను చాటుతూ, సేవా కార్యకలాపాలు కొనసాగించాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు. సమాజానికి సేవ చేయడం, మానవతా విలువలను పాటించడం, ప్రేమ, శాంతి, సత్య, ధర్మ, అహింసా సిద్ధాంతాలను అనుసరించడం భగవాన్ సత్యసాయి బాబా బోధించిన ముఖ్య సందేశాలు అని వక్తలు సూచించారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. భగవాన్ సత్యసాయి జయంతి వేడుకలు అధికారికంగా నిర్మించడం పట్ల సమితి అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్, ఇతర ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ సాయాగౌడ్, డీపీఓ శ్రీనివాస్ రావు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి పవన్ కుమార్, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి, ఎన్.ఐ.సి అధికారి మధు తదితరులు పాల్గొన్నారు.

