. రాజీవ్ గృహ కల్పలో గుండారాజ్యం
. పోర్షన్ కు రూ.10వేల అడ్వాన్స్.. నెల అద్దె రూ.400 వసూలు
. అద్దె ఇవ్వనన్నందుకు వ్యక్తిని కొట్టి చంపిన వైనం
. పలు పోర్షన్ లలో పత్తాలాట.. అసాంఘిక కార్యకలాపాలు
సర్కార్ కట్టించిన అపార్ట్ మెంట్ల(రాజీవ్ గృహ కల్ప)పై సదర్ సాబ్ తిష్టవేశాడు. బామ్మర్దితో కలిసి బావ అరాచకాలకు తెరలేపాడు. ఏకంగా ప్రభుత్వ ఆస్తిని చెరబట్టిన ఘనుడు రాజీవ్ గృహ కల్పలోని ఒక్కో ఫ్లాట్ కు రూ.10వేల అడ్వాన్స్, రూ.400 అద్దె వసూలు చేస్తూ అద్దెకు ఇస్తున్నాడు. వసూళ్ల కోసం ప్రత్యేకంగా మనుషులను నియమించడం గమనార్హం. ఇటీవల అపార్ట్ మెంట్ లో ఫ్యామిలీని ఉంచిన యాకూబ్ ఖాన్ అనే వ్యక్తి అద్దె ఎందుకు చెల్లించాలని తిరగబడడంతో అతడిని నలుగురు కలిసి కొట్టి చంపడం అక్కడి పరిస్థితి తీవ్రతను ఎత్తిచూపుతోంది.
నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని 11వ డివిజన్ పరిధిలోని అసద్ బాబా నగర్ లో ఉన్న రాజీవ్ గృహ కల్ప లో గుండా రాజ్యం నడుస్తోంది. ఉమ్మడి రాష్ర్టంలో వైఎస్ జమానాలో నిర్మించిన రాజీవ్ గృహ సముదాయాలను(అపార్ట్ మెంట్) ఇప్పటి వరకు యజమానులకు అప్పగించకపోవడం, వాటిని దక్కించుకున్న కొందరు యజమానులు నిర్లక్ష్యం చేయడంతో అక్కడ కొందరు గ్యాంగ్ గా ఏర్పడి అరాచకాలు సాగిస్తున్నారు. నగరంలోని అసద్ బాబానగర్ కు చెందిన బావాబామ్మర్దులు రాజీవ్ గృహ కల్ప పై కబ్జా కొనసాగిస్తున్నారు. మొత్తం అపార్ట్ మెంట్ల సముదాయాన్ని తము గుప్పిట్లోకి తెచ్చుకున్న వారు ఫ్లాట్ లను అద్దెకు ఇస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఒక్కో ఫ్లాట్ కు రూ.10వేల అడ్వాన్స్ గా తీసుకోవడంతోపాటు రూ.400 చొప్పున నెలవారీ అద్దె వసూలు చేస్తున్నారు. కొన్ని ఫ్లాట్ లలో పత్తాలాట ఆడించడంతోపాటు అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నా అటువైపు పోలీసులు, సంబంధిత అధికారు యంత్రాంగం కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. రాజీవ్ గృహకల్ప సముదాయానికి తానే ‘సదర్’నని ప్రకటించుకున్న వ్యక్తికి పోలీసులు, అధికారుల అండదండలు ఉండి ఉంటాయని, లేకపోతే ఏకంగా ప్రభుత్వ ఆస్తిని కబ్జాలోకి తీసుకుని అద్దెలకు ఇవ్వడం కుదరదని పలువురు పేర్కొంటున్నారు. దొంగ చాటుటుగా విద్యుత్ వాడుకుంటున్నా సంబంధిత శాఖ అధికారులు సైతం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇటీవల అక్కడ యాకూబ్ ఖాన్ అనే వ్యక్తి.. ప్రభుత్వ అపార్ట్ మెంట్ లో ఉంటున్న తాము మీకు అద్దె ఎందుకు చెల్లించాలని ఎదురుతిరగడంతో అతడిపై నలుగురు వ్యక్తులు దాడి చేయగా, మెడ నరాల చిట్లిన యాకూబ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. తన అన్నపై దాడి చేయడంతోనే చనిపోయాడని యాకూబ్ ఖాన్ సోదరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనతో రాజీవ్ గృహ కల్ప లో కొనసాగుతున్న గుండారాజ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ప్రైవేట్ సైన్యం నిఘా
బావాబామ్మర్దులు స్థానికంగా ప్రైవేట్ సైన్యాన్ని పోషిస్తున్నారు. అక్కడికి ఇతరుల ప్రవేశం నిషిద్ధం కాగా, రాకపోకలపై నిరంతరం నిఘా కొనసాగుతుంది. రాజీవ్ గృహ కల్ప వద్ద ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధులు, నాయకులు పట్టించుకోకపోవడానికి ప్రధాన కారణంగా ఓటు బ్యాంకు రాజకీయమే. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి గృహ కల్ప ఫ్లాట్లలో అద్దెకు ఉంటున్న వారికి ఇక్కడే ఓటు హక్కు కల్పిస్తుండడంతో డివిజన్ పరిధిలో వీరు సైతం కీలకంగా మారారు.
ఎంఐఎం కార్పొరేటర్ వద్ద పంపకాలు
మొత్తం రాజీవ్ గృహ కల్ప సముదాయాన్ని తమ గుప్పిట్లో ఉంచుకున్న బావాబామ్మర్దులు.. వాటి ద్వారా వచ్చే అడ్వాన్స్ లు, అద్దెలు, పత్తాలాట ద్వారా సమకూరే ఆదాయాన్ని గాంధీచౌక్ ప్రాంతానికి చెందిన ఓ ఎంఐఎం కార్పొరేటర్ వద్ద పంచుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.
36వ అపార్ట్ మెంట్లు.. 1152 ఫ్లాట్ లు
రాజీవ్ గృహ కల్ప సముదాయంలో మొత్తం 36 అపార్ట్ మెంట్లు ఉండగా ఒక్కో అపార్ట్ మెంట్ లో ఫ్లోర్ కు 8 ఫ్లాట్లు ఉన్నాయి. ఈ లెక్కన మొత్తం 1152 ఫ్లాట్ లు ఉండగా, ఒక్కో ఫ్లోర్ లో కనీసం మూడు కుటుంబాలు నివసిస్తున్నాయి. ఓ బిల్డింగ్ ను మాత్రం ట్రాన్స్ జెండర్లు వినియోగిస్తున్నారు.