27.5 C
Hyderabad
Friday, July 31, 2026

విద్యార్థులకు సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలని వినతి

Must read

📰 Generate e-Paper Clip

 

నసురుల్లాబాద్, బతుకమ్మ :

 

విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు సర్వీసులను పాఠశాల సమయాలకు అనుగుణంగా నడపాలని కోరుతూ బీజేపీ నాయకులు బాన్సువాడ ఆర్టీసీ డిపో మేనేజర్‌ రవికుమార్‌కు వినతిపత్రం అందజేశారు. నసురుల్లాబాద్ మండలంలోని హాజీపూర్, సంగెం, అంకోల్ గ్రామాలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు ప్రతిరోజూ నెమలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆర్టీసీ బస్సుల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఉదయం 7 గంటలకు బస్సు రావడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. ఉదయం వేళల్లో బస్సు సమయం ముందుగా ఉండటంతో చాలామంది విద్యార్థులు అల్పాహారం తీసుకోకుండానే పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందని, దీని వల్ల ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తినకుండా ఉండి కొందరు విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని పేర్కొన్నారు. అలాగే సమయానికి పాఠశాలకు చేరుకోలేక ఆలస్యంగా రావడం, కొందరు గైర్హాజరు కావడం వల్ల విద్యాభ్యాసానికి ఆటంకం కలుగుతోందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటలకు ఉన్న బస్సు సర్వీసును ఉదయం 8 గంటలకు నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను కోరారు. పాఠశాల సమయాలకు అనుగుణంగా బస్సులను నడిపితే విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నసురుల్లాబాద్ మండల అధ్యక్షులు చందూరి హన్మాండ్లు యాదవ్, నెమిలి సర్పంచ్ రామ్ గోపాల్ రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షులు కొనాల గంగారెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, మాజీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్, బీజేపీ నాయకులు శ్యామల శ్రీకాంత్, చీకట్ల రాజు, చరణ్, ప్రణయ్, అశ్విన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article