29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

రాజన్న ఆలయ విస్తరణ పనులు పూర్తి చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా కలెక్టర్ ఎం.హరిత

 

రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం విస్తరణ, అభివృద్ధి పనులు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. హరిత ఆదేశించారు.ముందుగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కలెక్టర్ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం కళ్యాణ మండపంలో వేద పండితులు, ఆలయ అర్చకులు కలెక్టర్ కు ఆశీర్వచనం చేశారు. వారికి ఆలయ ఈఓ రమాదేవి ప్రసాదం అందజేశారు. ఆలయ ప్రాంగణంలో చేపడుతున్న కట్టడాల కూల్చివేత పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం విస్తరణ, అభివృద్ధిపై ఆలయ అతిథి గృహంలో వీటీఏడీఏ, ఆలయ అధికారులు, అర్చకులు, ఆర్ & బీ, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఆలయ విస్తరణ, అభివృద్ధిపై రూపొందించిన నమూనాను కలెక్టర్ కు క్షేత్ర ఆర్కిటెక్ట్ సూర్య నారాయణ మూర్తి విపులంగా వివరించారు. ప్రస్తుతం ఉన్న భవనాల కూల్చివేత పనులు, ప్రణాళిక ప్రకారం చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. హరిత మాట్లాడారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు వీటీఏడీఏ ఆద్వర్యంలో శ్రీకారం చుట్టిందని తెలిపారు.  ఆలయ విస్తరణకు పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. రోజూ వారీగా చేపట్టే పనుల వివరాలు ఇవ్వాలని సూచించారు. నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్ కు ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రతి రోజూ ముఖ్యమేనని, ఒక్కరోజు కూడా వృథా చేయకుండా పనులు కొనసాగించాలని తెలిపారు.వచ్చే మేడారం సమ్మక్క – సారలమ్మ జాతరకు ముందు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇబ్బందులు కలగకుండా పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెలలో శృంగేరి పీఠాధిపతులు రానున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి పనులు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని, క్షేత్ర స్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు.

  • భీమేశ్వర ఆలయంలో క్షేత్ర స్థాయిలో పరిశీలన..

భీమేశ్వర ఆలయంలో భక్తుల సౌకర్యార్థం  అభిషేకం, అన్న పూజ, కోడె క్యూలైన్లో, కౌంటర్స్, ప్రసాదం తయారీ విభాగం ,నిత్య కళ్యాణము, సత్యనారాయణ వ్రతం మండపంతోపాటు పలు ప్రదేశాలను ఆలయ అధికారులు, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. ఈ సమావేశంలో ఆర్&బీ సీఈ రాజేశ్వర్ రెడ్డి, ఆలయ ఈఓ ఎల్.రమాదేవి, క్షేత్ర ఆర్కిటెక్ట్ సూర్య నారాయణ మూర్తి, ఆర్&బీ ఈఈ నరసింహ చారి, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, తహసీల్దార్ విజయ ప్రకాష్ రావు, వీటీఏడీఏ సెక్రటరీ అన్సార్, ఆలయ అర్చకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Rajanna temple expansion work should be completed

More articles

Latest article