అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్
నిజామాబాద్, బతుకమ్మ : పదో తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశమై పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మార్చి నెల 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. అలాగే, పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగుతాయని వివరించారు. ఇంటర్ పరీక్షలకు 36,222 మంది విద్యార్థులు హాజరు కానుండగా, 57 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా పదో తరగతి పరీక్షలకు 22,915 మంది విద్యార్థులకు గాను 141 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. పరీక్షలను సాఫీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు పరీక్షల సమయాలకు అనుగుణంగా బస్సులు నడిపించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని ట్రాన్స్ కో ఎస్ఈ రవీందర్ కు సూచించారు. నిర్ణీత సమయానికి సకాలంలో ప్రశ్నపత్రాలు కేంద్రాలకు చేర్చాలన్నారు. పరీక్షలు ప్రారంభం అయ్యే సమయానికి ముందే విద్యార్థులు తమకు కేటాయించబడిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ హితవు పలికారు. ఎలాంటి లోటుపాట్లను తావులేకుండా పరీక్షలను సజావుగా కొనసాగేలా సమన్వయంతో పని చేయాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్ లను మూసి వేయించాలని, 144 సెక్షన్ అమలు చేయాలని, తగిన సంఖ్యలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ తప్పనిసరిగా తాగునీటి వసతి అందుబాటులో ఉంచాలని, పరిశుభ్రమైన వాతావరణం నెలకొనెలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను ఎగ్జామ్ సెంటర్లలో నియమిస్తూ, ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించి, కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలన్నారు. ఆయా శాఖల అధికారులు అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని అన్నారు. ఈసమావేశంలో జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఐఈవో రవికుమార్, జిల్లా విద్యాశాఖ పరీక్షల విభాగం సహాయ కమిషనర్ విజయభాస్కర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

