29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియలో పురోగతి సాధించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా చేపట్టిన మ్యాపింగ్ ప్రక్రియలో పురోగతి సాధించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి. సూచించారు. సోమవారం ఆయన హైదరాబాద్ నుంచి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా మ్యాపింగ్ ప్రక్రియ మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాలు మాత్రమే 90 శాతం పూర్తి చేశాయని, వచ్చే 15 రోజుల్లో అన్ని జిల్లాలు వేగంగా పని చేసి 90 శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు.

 

Progress must be made in the SIR mapping process.

 

జీహెచ్‌ఎంసీ పరిధిలో గత 10–15 రోజులలో రెండు లక్షలకు పైగా మ్యాపింగ్ నమోదు కావడాన్ని అభినందించిన సీఈఓ, ఇతర జిల్లాలు కూడా అదే స్థాయిలో పురోగతి సాధించాలని సూచించారు. ఎన్నికల మ్యాపింగ్ ప్రక్రియలో తప్పులు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఒక ప్రాంతానికి చెందిన ఓటరును మరో ప్రాంతంలో మ్యాప్ చేసిన ఘటనలు తమ దృష్టికి వచ్చాయని, ఇటువంటి పొరపాట్లను వెంటనే సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. అనధికార వ్యక్తులు, రాజకీయ ప్రతినిధులు నేరుగా మ్యాపింగ్ ప్రక్రియలో జోక్యం చేసుకోవద్దని, కేవలం ఇళ్ల గుర్తింపు లేదా సమాచారపరంగా మాత్రమే సహకరించాలని స్పష్టం చేశారు. ప్రతి రోజు మ్యాపింగ్ పురోగతి, పంపిణీ చేసిన ఫారాలు, సేకరించిన ఫారాల వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి మ్యాపింగ్ వేగవంతం చేయాలని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా బీఎల్ఓల పేర్లు, ఫోన్ నంబర్లను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన ధృవీకరణ, సరైన డేటా నమోదు, పారదర్శకతతో పని చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంను మినహాయిస్తే జిల్లాలో సగటున 86శాతం  మ్యాపింగ్ పూర్తయ్యిందని అన్నారు. అర్బన్ సెగ్మెంట్ లో కూడా వచ్చే పది రోజులలో స్పష్టమైన పురోగతి సాధిస్తామని సీ.ఈ.ఓకు తెలియజేశారు. వీ.సీ అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశమై స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. ఎస్ఐఆర్ లో అర్బన్ సెగ్మెంట్ ఎంతో వెనుకబడిందని, ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులు పరిష్కరించి, ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో జిల్లా సగటు గణనీయంగా పెరిగేలా అంకితభావంతో కృషి చేయాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

 

Progress must be made in the SIR mapping process.

More articles

Latest article