28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి

Must read

📰 Generate e-Paper Clip

  • కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
  • ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల తనిఖీ
  • మోపాల్, నడిపల్లి రైతు వేదికలు పరిశీలన

 

నిజామాబాద్, బతుకమ్మ : భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం జిల్లాలో సమర్ధవంతంగా అమలయ్యేలా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి రెవెన్యూ అధికారులకు సూచించారు. శనివారం ఆయన నిజామాబాద్ ఆర్డీఓ కార్యాలయాన్ని, సౌత్, నార్త్ తహసీల్దార్ ఆఫీసులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూభారతి రెవెన్యూ సదస్సుల సందర్భంగా వచ్చిన దరఖాస్తులు, వాటి పరిష్కారానికి చేపడుతున్న చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకుని, సంబంధిత రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దరఖాస్తులను వెంటదివెంట పరిశీలిస్తూ, నిర్ణీత గడువు లోపు పరిష్కారం అయ్యేలా చొరవ చూపాలన్నారు. భూభారతి చట్టంపై పూర్తి అవగాహన ఏర్పర్చుకుంటే దరఖాస్తులను సకాలంలో, సులభంగా పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని హితవు పలికారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా, భూభారతి చట్టంలోని నిబంధనలను తు.చ తప్పకుండా పాటిస్తూ, పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తూ, అందుబాటులో ఉన్న రెవెన్యూ రికార్డుల వివరాలతో సరిపోల్చుకుని, క్షేత్రస్థాయి విచారణను పకడ్బందీగా జరపాలని అన్నారు. నూతన ఆర్ఓఆర్ చట్టంలో అప్పీల్, రివిజన్ వ్యవస్థలు ఉన్నందున పొరపాట్లకు ఆస్కారం లేకుండా దరఖాస్తుల పరిష్కారంలో ఎంతో జాగరూకతతో వ్యవహరించాలని హితవు పలికారు. పెండింగ్ దరఖాస్తుల వివరాలను, వాటి పరిష్కారంలో జాప్యానికి గల కారణాలను పొందుపరుస్తూ తనకు నివేదిక పంపాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, సౌత్, నార్త్ తహసీల్దార్లు బాలరాజు, విజయ్ కాంత్, ఇతర రెవెన్యూ అధికారులు ఉన్నారు.

  • ‘రైతు నేస్తం’ కార్యక్రమానికి రైతు వేదికలను ముస్తాబు చేయాలి..

ప్రభుత్వం ఈ నెల 16న నిర్వహించనున్న రైతు నేస్తం కార్యక్రమాన్ని పురస్కరించుకుని జిల్లాలోని అన్ని రైతు వేదికలను అందంగా ముస్తాబు చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన డిచ్పల్లి మండలం నడిపల్లి, మోపాల్ మండల కేంద్రంలోని రైతు వేదికలను సందర్శించి, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ప్రతి రైతు వేదికలోనూ నీటి వసతి, టాయిలెట్స్, సరిపడా ఫర్నీచర్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. రైతు వేదికలు పరిశుభ్రంగా ఉండాలని, ఆహ్లాదకర వాతావరణం ఉండేలా వేదిక ఆవరణాలలో అందమైన పూల మొక్కలు, పచ్చదనాన్ని పెంపొందించేలా మొక్కలు నటించాలని సూచించారు. రైతు నేస్తం కార్యక్రమానికి ఆదర్శ రైతులతో పాటు, స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులతో ముఖాముఖి జరుపనున్నందున ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వీరాస్వామి తదితరులు ఉన్నారు.

Priority should be given to resolving land-based applications.

More articles

Latest article