. గత ప్రభుత్వ హయంలో ప్రభుత్వ భూమిగా బోర్డు
. ధరణిలో శిఖం భూమికి పట్టా ఇచ్చిన రెవెన్యూ యంత్రాంగం
. కబ్జాకు కొనసాగుతున్న ప్రయత్నాలు
నిజామాబాద్, బతుకమ్మ : గ్రామ అవసరాలకు సర్కారీ, చరాయి, గ్రామకంఠం భూములతోపాటు కాల్వలు, చెరువులు ఉన్నప్పుడు శిఖం భూములు ఉండడం సర్వసాధారణం. అలాంటి భూములు ఏళ్ల తరబడి రికార్డుల్లో మాత్రం మారలేదు. ధరణి వచ్చే వరకు అది ప్రభుత్వ భూములుగా ప్రకటించి కాపాడిన యంత్రాంగం ధరణిలో మాత్రం పట్టా ఇవ్వడం విశేషం. ధరణి పేద వారికి ఒక విధంగా, పెద్దలకు మరో విధంగా పని చేసింది అనడానికి నిజామాబాద్ నగరంలోని బోర్గాం(పి) ప్రభుత్వ పాఠశాల ప్రక్కన భూమిలో కొందరికీ పట్టాలు రావడం నిదర్శనం. ఇప్పుడు ఆ భూమిని కబ్జా చేసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం కోట్ల విలువ చేసే భూములు ప్రభుత్వానికి అవసరం కాగా వాటిని కాపాడుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. బోర్గాం(పి) గ్రామంలో ఉన్న అతిపెద్ద పాఠశాలకు క్రీడా మైదానం లేదు. దానిని ఆనుకుని ఉన్న చెరువు శిఖం భూమిని చదును చేసి పాఠశాలకు క్రీడా స్థలం కేటాయిస్తే విద్యార్థులకు, గ్రామానికి ఉపయోగపడుతుంది. కానీ ఇవేమీ పట్టకుండా కొందరు అధికార పార్టీ నేతలు దానిపై గురిపెట్టారు.

మోపాల్ మండలం పరిధిలోకి వచ్చే బోర్గాం(పి)లో పదుల సంఖ్యలో ప్రభుత్వ, చెరువు కట్ట , కెనాల్ భూములు ఉన్నాయి. సర్వే నంబర్ 17లో ఆయా భూములున్నాయని రికార్డులు చెబుతున్నాయి. బోర్గాం జిల్లా పరిషత్ హై స్కూల్ పక్కన సర్వే నంబర్ 586లో 2.38 ఎకరాల భూమి శిఖం తలాబ్ గా రికార్డుల్లో ఉండగా, వివరాలు రెవెన్యూ రికార్డులు పక్కాగా ఉన్నాయి. బోర్గాం గ్రామం నిజామాబాద్ లో గతంలోనే విలీనం కాగా ఆ భూములపై కన్నువేసిన కొందరు వాటిని చెరబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ధరణి రాకముందు గతంలో కబ్జాకు ప్రయత్నాలు జరగగా గ్రామానికి చెందిన కొందరు యువకులు, సామాజిక కార్యకర్తలు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వ భూముల్లో బోర్డులు పాతారు. అయినప్పటికీ గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి కారణంగా ఆ భూములకు యజమానులు పుట్టుకొచ్చారు. సర్వే నంబర్ 586లో 2.38 ఎకరాల భూమి ఉన్నట్లు దశబ్దాలుగా రికార్డులో ఉండగా ధరణి వచ్చిన తర్వాత అందులో ఎకరానికి పట్టా వచ్చింది. రెవెన్యూ శాఖలో ఘనత వహించిన అధికారులు రికార్డుల్లో కొత్త పేర్లు నమోదు చేశారు.

. . . రూ.5కోట్ల విలువ చేసే భూమి
ప్రస్తుతం బోర్గాం ప్రాంతంలో ఎకరాకు రూ.5 కోట్లపైనే ధర పలుకుతుంది. అది కూడా రోడ్డు వెంబడి ఉండడంతో ఆ భూమిని కబ్జా చేసేందుకు గత ప్రభుత్వ హయాంలోనే ప్రయత్నాలు జరిగాయి. గ్రామ అవసరాలకు ఆ భూమి పనికొస్తుందని, విద్యార్థులకు క్రీడా స్థలాన్ని కేటాయించాలని కొందరు సామాజిక కార్యకర్తలు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ మేరకు ప్రభుత్వానికి దరఖాస్తు చేయగా అవన్నీ బుట్టదాఖలయ్యాయి. పక్కాగా రికార్డుల్లో ఉన్న శిఖం భూమిని కచ్చితంగా స్కూల్ కు లేదా గ్రామ అవసరాలకు వాడాలని కోరుతున్నారు. అయితే కబ్జాదారులు మాత్రం దానిని చెరబట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
. . . కబ్జాపై కన్నేసిన అధికార పార్టీ మాజీ ప్రజాప్రతినిధి
గత ప్రభుత్వాల హయాంలో బీఆర్ఎస్ లో ఉన్న వారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పార్టీ మారి భూమి కబ్జాకు తెర లేపారు. ఇప్పుడు అధికార పార్టీ పేరు చెప్పి గ్రామానికి చెందిన ప్రముఖుడే కబ్జాకు తెర లేపడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల గత కొన్ని నెలలుగా ఈ విషయంపై సమాచార హక్కు చట్టం కింద ఫిర్యాదులు చేసినా రెవెన్యూ యంత్రాంగం ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలో తహసీల్దార్ గా పని చేసిన అధికారి ఒక అసోసియేషన్ నేతతో కలిసి భూమికి యజమానిని పుట్టించడంలో కీలక పాత్ర వహించినట్లు తెలిసింది. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ స్థలాలు లేవని చెబుతున్న అధికార పార్టీ నాయకులు , సొంత పార్టీ మాజీ ప్రజాప్రతినిధి కబ్జాపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. గుట్టుచప్పుడు కాకుండా ముందుగా కబ్జాకు పెట్టి దానిని రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ జరుగుతున్నట్లు వినికిడి. తాజాగా సంబంధిత భూమిపై ల్యాండ్ సర్వే అధికారులకు మరోసారి సర్వే, స్వాధీనం కోసం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

