- వారసులకు సంబంధం లేకుండా భూమి రిజిస్ట్రేషన్
- రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ మండలం గుండారం గ్రామంలో పంచాయితీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి వారసులకు సంబంధం లేకుండా ఇంటిని రిజిస్ట్రేషన్ చేసిన సంఘటన పోలీసుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చంది. నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ లోని గుండారంలో గంధం లచ్చయ్యకు గంధం గంగాధర్, గంధం సుదర్శన్ లతో పాటు గంధం విజయలక్ష్మీ సంతానం. ముగ్గురికి వివాహాలు జరుగగా ఆస్తుల విభజనలో వివాదాలు ఉండి కోర్టు పంచాయితీలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల గంధం గంగాధర్ , గంధం సుదర్శన్ లకు సంబంధం లేకుండా వారి తండ్రి ఆస్తిని వారి సోదరి కుమార్తె రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ విషయంపై బాధితులు స్థానిక పంచాయితీ కార్యదర్శిని నిలదీశారు. అయితే ఆ సంతకం తనది కాదని ఫోర్జరీ అని తెలుపడంతో బాధితులు నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అదే విధంగా రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని సబ్ రిజిస్ట్రార్ కు కూడా ఫిర్యాదు చేశారు. తమకు సంబంధం లేకుండానే దొంగ సంతకాలతో ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న తమ సోదరి కుమార్తె అంగన్ వాడి టీచర్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బాధితులు లిఖితపూర్వకంగా రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
