ఎల్లారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో ఆందోళనకారులు నిరసన కొనసాగుతోంది. గత నాలుగు గంటలుగా ధర్నా నిర్వహించడంతో ఎల్లారెడ్డి–కామారెడ్డి ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ, గెలిచిన పాపయ్య సర్పంచ్ అభ్యర్థిత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ, న్యాయం జరగే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబాను పార్టీ మండల అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో అవకతవకలు, అన్యాయ నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపణలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆందోళనకారులతో చర్చలు జరుపుతున్నప్పటికీ, తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళన విరమించబోమని తేల్చిచెప్పారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశముండటంతో ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

