బతుకమ్మ, బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని ఎరాజ్‌పల్లి గ్రామానికి చెందిన మల్లారం సాయిలు (44) ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన మంగళవారం వరకు తిరిగి రాలేదు. మంగళవారం గ్రామ శివారులోని చెరువులో ఆయన మృతదేహం కనిపించడంతో గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బోధన్ రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చెరువులోనుండి బయటకు తీశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం కోసం పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు మల్లారం సాయిలుకు భార్య ప్రమీలతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త, తండ్రిని కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గ్రామస్తులు కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
