నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:
నిజామాబాద్ జిల్లాలో నీట్ పరీక్ష ప్రశాంతం గా ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పరీక్ష కోసం డిచ్పల్లి లోని తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ భవనంలో, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ భవనంలో, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యూజీ బ్లాక్ లో, ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ బ్లాక్ లో, బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో, నిజామాబాద్ కంటేశ్వర్ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, మాక్లూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

జిల్లాలో నీట్ కోసం 3334 మంది పరీక్షకు హాజరు కానున్నారు.పరీక్ష కేంద్రం లోకి అభ్యర్థులను ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే అనుమతించారు. పరీక్ష హాల్ లోకి వెళ్లే ముందు బయోమెట్రిక్ హాజరు, రిజిస్ట్రేషన్, తనిఖీ వంటి ప్రక్రియలు చేపట్టాల్సి ఉన్నందున అభ్యర్థులు ముందస్తుగానే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డు, ఐ.డి ప్రూఫ్, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తమ వెంట తెచ్చుకుంటేనే అనుమతించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద సీసీ కెమెరాలను అమర్చడం జరిగిందని, పకడ్బందీ నిఘా నడుమ సజావుగా పరీక్ష జరిగేలా చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలు చేస్తున్నట్లు పోలిస్ కమీషనర్ సాయి చైతన్య తెలిపారు

