. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ.. రైతుల డబ్బులతో వేతనం
. గత పాలకవర్గం సస్పెండ్ చేసినా.. మళ్లీ విధుల్లోకి వచ్చిన వైనం
నిజామాబాద్, బతుకమ్మ: ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అంటూ ఓ రాజకీయ పార్టీని పెట్టుకున్న గడ్డం నర్సారెడ్డి అక్కడితో ఆగకుండా ఐడీసీఎంఎస్ లో ఉద్యోగిగా చలామణి అవుతూ అటు రాజకీయ, ఇటు ఉద్యోగ నాటకాన్ని సమానంగా నడుపుతున్నారు. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఐడీసీఎంఎస్ లో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తూ రైతుల డబ్బులను జీతంగా తీసుకుంటున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.
జిల్లా రైతాంగానికి సేవలు సులభంగా అందించేందుకు సహకార సొసైటీలు (పీఏసీఎస్), డీసీసీబీ, ఐడీసీఎంఎస్ ( ఇందూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్) ఉన్నాయి. అయితే ఐడీసీఎంఎస్ లో ఓ రాజకీయ పార్టీ నాయకుడు ఉద్యోగిగా చలామణి అవుతుండడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయినప్పటికీ పాలకవర్గం, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఐడీసీఎంస్ లో సుమారు 20 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఒక్కొక్కరికి రూ.25వేల నుంచి రూ.30వేల వరకు వేతనాలను సంస్థ చెల్లిస్తోంది. ఐడీసీఎంఎస్ ద్వారా సొసైటీలకు పంపిణీ చేసిన ఎరువులు, మందుల సంచులపై వచ్చే ఒక్కో రూపాయి పోగుచేసి ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా వచ్చే కమీషన్ ను వేతనాలకు ఉపయోగిస్తున్నారు. ఇలా ఒక్కో రూపాయి జమ చేసి సిబ్బందికి వేతనాలు చెల్లించే ఐడీసీఎంఎస్ ఓ రాజకీయ పార్టీ నాయకుడికి వేతనం ఎందుకు ఇస్తుందో చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. రైతులు, ఉద్యోగుల ఫిర్యాదు మేరకు గడ్డం నర్సారెడ్డిని గత పాలకవర్గ చైర్మన్ సాంబారి మోహన్ పాలకవర్గం తీర్మానం చేయించి సస్పెండ్ చేశారు.
ఆ తరువాత ఆరునెలలకు తనకున్న పరిచయాలతో మాజీ స్పీకర్ సహాయం తీసుకుని గడ్డం నర్సారెడ్డి మళ్లీ విధుల్లో చేరారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా గడ్డం నర్సారెడ్డిని విధుల్లో నుంచి తొలగించి ఐడీసీఎంఎస్ ను కాపాడాలని రైతులు కోరుతున్నారు.

