నిజామాబాద్, బతుకమ్మ :
దక్షిణ మధ్య రైల్వే భారతీయ రైల్వే అభివృద్ధి పథంలో కీలక పాత్ర పోషిస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రయాణికుల సేవలు వంటి విభిన్న రంగాల్లో విశేషంగా తోడ్పడుతోంది. ఈ క్రమంలో సరుకు రవాణా విభాగాన్ని మరింత విస్తరించేందుకు పలు సరుకు రవాణా కార్యక్రమాలు చేపడుతోంది. ఈ ఒరవడిని కొనసాగిస్తూ నిజామాబాద్ ప్రాంతం సమీపంలో సరుకు రవాణా, వస్తువుల నిర్వహణ సౌకర్యాలను మరింత మెరుగుపరచడం, అలాగే స్థానిక వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చడం లక్ష్యంగా ఈ జోన్‌లోని హైదరాబాద్ డివిజన్ జానకంపేట్ రైల్వే స్టేషన్‌లో రూ.9 కోట్ల వ్యయంతో ఒక కొత్త గూడ్స్ షెడ్‌ను అభివృద్ధి చేసింది. తెలంగాణలోని జానకంపేట్ గూడ్స్ షెడ్ ను నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి దేశానికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు బి.మహేష్ కుమార్ గౌడ్, సి.అంజి రెడ్డి, ఎం.కొమరయ్య, శాసన సభ్యులు ఆర్.భూపతి రెడ్డి ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ డివిజన్ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ డి.ఎస్. రామారావు, దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఎ.శ్రీధర్, హైదరాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ అనిరుధ్ పమర్ తో పాటు ఇతర సీనియర్ రైల్వే అధికారులు కూడా హాజరు కానున్నారు. జానకంపేట్ లో నూతనంగా ప్రారంభించబడిన గూడ్స్ షెడ్ కారణంగా ఈ ప్రాంతంలో సరుకు రవాణాకు గణనీయమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది సరుకు రవాణా వినియోగదారులకు, వర్తకులకు, వ్యాపారులకు అపారమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఈ గూడ్స్ షెడ్‌లో మరిన్ని సరుకు రవాణా రైళ్ల నిర్వహణతో పాటు కొత్త వస్తువుల లోడింగ్‌కు కూడా విస్తృత అవకాశాలు ఉన్నాయి.

