- టీయూసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.నరేందర్, ఎం.సుధాకర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని టీయూసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.నరేందర్, ఎం.సుధాకర్ పిలుపునిచ్చారు. సార్వత్రిక సమ్మె పోస్టర్లను కోటగల్లిలోని శ్రామిక భవన్ లో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 11 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు పడిపోయాయన్నారు. అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగినాయని, కానీ కార్మికుల వేతనాలు పెరగలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ స్కీం వర్కర్లైన కేజీబీవీ, మోడల్ స్కూల్, అంగన్వాడి సిబ్బందికి కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలన్నారు. కార్మికులకు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కరువైందన్నారు. మోడీ ప్రభుత్వం అవలంబించిన కార్పోరేట్ కంపెనీల అనుకూల, కార్మిక వ్యతిరేక విధానాలే ఇందుకు కారణమన్నారు. కార్మికుల సాధించుకున్న హక్కులను సైతం మోడీ ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, కనీస వేతనాల అమలు కోసం, కనీస పెన్షన్ 9వేల అమలు కోసం, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా, పనిగంటల పెంపుదలకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలు ఈనెల 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. ఈ సమ్మెలో జిల్లాలోని కార్మికులందరూ పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు డి.రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి డి.కిషన్, జిల్లా నాయకులు సాయన్న, కిరణ్, రవికుమార్, గంగాధర్, చరణ్, లింగం తదితరులు పాల్గొన్నారు.
