. . . టీయుసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
అర్హులైన కార్మికులందరికి లేబర్ కార్డులు ఇవ్వాలన్నాని, పెన్షన్ లను పెంచాలని టియుసిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నగరంలోని నెహ్రూ పార్క్ కార్మికుల అడ్డా వద్ద బుధవారం పోస్టర్ లను ఆవిష్కరించారు. అనంతరం సుధాకర్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఉన్నా కార్మికులకు సంక్షేమ పథకాలు సమగ్రంగా అందడం లేదన్నారు. ఇన్సూరెన్స్ రెన్యువల్ ని ప్రైవేటు కంపెనీలకు ఇవ్వకూడదన్నారు. నిర్మాణ రంగ కార్మికులు సహజ మరణానికి 5 లక్షలు, 60 సంవత్సరాలు దాటిన కార్మికులకు 9000 రూపాయల పెన్షన్ ఇవ్వాలన్నారు. పెళ్లి సమయంలో, పిల్లలు పుట్టినప్పుడు ఇచ్చే 30 వేల ఆర్థిక సహాయాన్ని లక్ష రూపాయలకు పెంచాలన్నారు. ఎండాకాలం కార్మికులు అడ్డాల వద్ద నిలుచోవడానికి షెల్టర్లు, తాగునీరు, మూత్రశాలల సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 25న హైదరాబాద్ లో లేబర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని భవనిర్మాణ కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టియుసిఐ జిల్లా నాయకులు బి.లింగం, భవనిర్మాణ కార్మికులు సంతోష్, కరణ్, మహేష్, రవి, సాయన్న, గంగాధర్, సల్మాన్, ఫయాజ్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
