అశోకుడిని నమ్మితే  మిగిలేది శోకమే..

0 2,352

If you believe in Ashoka, the only thing left is sorrow..

. 72 మందిలో రైల్వే బైపాస్ గుబులు

. ప్రస్తుతం పులాంగ్ బఫర్ జోన్ లో అపార్ట్ మెంట్ ల నిర్మాణం

. నిన్న రైల్వే బైపాస్.. రేపు ‘నిడ్రా’లో మునగడం తప్పదా

నిజామాబాద్, బతుకమ్మ:  ‘మా ద్వారా మీ కలను నిజం చేసుకోండి..’ అంటూ ఉదరగొడుతూ నిజామాబాద్ నగరంలో జోరుగా వెంచర్లు, అపార్ట్ మెంట్లు, విల్లాలు చేస్తున్న అశోకుడిని నమ్ముకుంటే చివరికి మిగిలేది శోకమే అనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నగర భవిష్యత్.. అభివృద్ధి ఇక్కడే అంటూ అరచేతిలో ఇంద్రభవనాలను చూపుతూ బైపాస్ లో జోరుగా దందాలు చేస్తున్న రియల్టర్లలో మొదటి వరుసలో ఉంటున్నాడు అశోకుడు. ఇప్పటికే తాను బైపాస్ రోడ్డులో చేసిన వెంచర్ లో నుంచి ‘రైల్వే బైపాస్ లైన్’ వెళ్తుండడంతో బాధితులు రోడ్డెక్కారు. రూపాయిరూపాయి పోగు చేసిన డబ్బులతో మనిషిని నమ్మి ప్లాట్లు కొనుగోలు చేశామని, ఇప్పుడు మా పరిస్థితి ఏమిటని గుండెలుబాదుకుంటున్నారు. రైల్వే బైపాస్ ముందే వస్తుందని తెలిసీ తమను మోసం చేశాడని ఆరోపిస్తున్నారు.

నిజామాబాద్ నగరంలో ప్లాట్లు, అపార్ట్ మెంట్లు, విల్లాలు కొనుగోలు చేయాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఎక్కడ ప్లాటు, ఇండ్లు కొన్నా రేపు వాటిలో ఏ కిరికిరి బయటికి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం హైదరాబాద్ లో అమలు చేస్తున్న హైడ్రా రాష్ర్ట వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మూసి పరీవాహక ప్రాంతాలు, చెరువుల  ఎఫ్ టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవల్)తో పాటు బఫర్ జోన్ లలోని నిర్మాణాలను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కుల్చివేస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడ చూసినా ఇదే చర్చ  జరుగుతోంది. హైడ్రాను అన్ని జిల్లాల్లకు విస్తరించాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం సైతం హైడ్రాకు చట్టబద్ధత తీసుకువస్తూ జిల్లాల్లోకి విస్తరిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని హైడ్రా.. నిజామాబాద్ కు ‘నిడ్రా’ గా వచ్చి ఇక్కడ రియల్టర్లు, బిల్డర్ల కారణంగా తమకు నిద్ర లేకుండా చేస్తుందని ఆందోళన చెందుతున్నారు.

పేరు మోసిన బిల్డర్..

జిల్లాలో పేరు మోసిన బిల్డర్ గా గుర్తింపు ఉన్న అశోకుడు నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డులో 2021లో వెంచర్ ఏర్పాటు చేశారు. సూమారు 10 నుంచి 12 ఎకరాల్లో 220 గజాల నుంచి 245 గజాల చొప్పున సుమారు 200  ప్లాట్లను చేశారు. ఒక్కో ప్లాటును రూ.15 వేల నుంచి రూ.20వేల వరకు విక్రయించేశారు. దీనికి నుడా నుంచి ఏప్రిల్ లో నెలలో అనుమతులు వచ్చాయి. దాదాపు ప్లాట్లు అమ్ముడు పోగా, కొనుగోలు చేసిన వారికి ఈ ఏడాది జూన్ లో పిడుగు లాంటి వార్త తెలిసింది. రైల్వే బైపాస్ నిర్మాణం కోసం ఆ శాఖ వెంచర్ లోని ప్లాట్లలో నుంచి హద్దులు ఏర్పాటు చేసింది. రైల్వే శాఖ గుర్తించిన హద్దుల్లోనే 72 ప్లాట్లు పోతుతుండడంతో కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. వెంచర్ చేసిన వ్యక్తి అన్నీ తెలిసి వెంచర్ చేశాడని, తమను తప్పుదోవ పట్టించాడని తామంతా కలిసి కోట్లు కుమ్మరించి ప్లాట్లు కొనుగోలు చేశామని లబోదిబోమంటున్నారు. గత మూడునాలుగేళ్లుగా రైల్వే బైపాస్ కోసం చర్చ జరుగుతుండగా రియల్టర్ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి స్థలాలను తమకు కట్టబెట్టాడని అంటున్నారు. రైల్వేశాఖ చెల్లిస్తామంటున్న గజానికి రూ.2,700 పరిహారం ఏమూలకు సరిపోదని, రియల్టర్ చేతులెత్తేశాడని అంటున్నారు. ఈ  విషయమై ప్రశ్నిస్తే తాను అధికార పార్టీ  నాయకులకు మంచి మిత్రుడినని, తనకు పెద్ద తలకాయల అండ ఉందని బెదిరిస్తున్నాడని వాపోతున్నారు.

బఫర్ జోన్ లో భారీ నిర్మాణాలు

బైపాస్ రోడ్డులో వెంచర్ చేసి 72 మంది జీవితాలను ఆగం చేసిన అశోకుడు ఈ సారి పూలాంగ్ వాగు బఫర్ జోన్ లో భారీ నిర్మాణాలు చేపట్టాడు. ఓ వైపు హైడ్రా హడలెత్తిస్తుండగా, మరో వైపు నిడ్రా వస్తుందనే చర్చ సర్వత్రా కొనసాగుతున్న తరుణంలో సదరు రియల్టర్ కు చెందిన నిర్మాణ సంస్థ పులాంగ్ వాగు  బఫర్ జోన్ లో భారీ నిర్మాణాలకు సంబంధించి కంపౌండ్, జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి నిర్మాణాలు చేపడుతున్నా బల్దియా అధికారులు మొద్దు నిద్ర నటిస్తున్నారు. ఎల్లమ్మగుట్ట శివారులో వాగును ఆనుకుని ఈ తతంగం జరుగుతోందని, హైడ్రా మాదిరి నిడ్రా అమలు చేస్తే అందులో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు రోడ్డున పడటం ఖాయమని పలువురు పేర్కొంటున్నారు.  కోట్లు కుమ్మరించి విలువైన అపార్ట్ మెంట్లు కొనుగోలుచేసిన వారికి నిడ్రా వచ్చిన తరువాత ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుందంటున్నారు. ఈ ఏడాది ఆగస్టులో నగరంలోని బొందెం చెరువు ఆక్రమణలను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కూల్చేసిన విషయం తెలిసిందే.

If you believe in Ashoka, the only thing left is sorrow..

Leave A Reply

Your email address will not be published.