. ముస్లిముకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆ వర్గంలో నిరాశ
. జిల్లా కేంద్రంలో నిరసన.. 14శాతం ఉన్న తమను పట్టించుకోలేదని ఆవేదన
. షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ దక్కుతుందని ఆశించామంటున్న ముస్లిం నాయకులు
నిజామాబాద్, బతుకమ్మ: మైనారిటీ కోటాలో సీనియర్ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ దక్కుతుందని, ఆయన మంత్రి కావడం ఖాయమని భావించిన ముస్లిములు చివరకు ఖంగుతిన్నారు. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ మరోసారి తన మార్క్ ను ప్రదర్శించింది. సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకొని అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతిని అభ్యర్థులుగా ఎంపిక చేశామని చెబుతుండగా, ముస్లిములను ఎందుకు పట్టించుకోలేదనే వాదన తెరపైకి వచ్చింది. ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ కు మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వడంతోపాటు మంత్రి పదవి దక్కుతుందని తాము ఆశించామని ముస్లింలు అంటున్నారు. 14శాతం ఉన్న తమ వర్గానికి న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. తాము కాంగ్రెస్ ను నమ్ముకుని ఉంటే న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభాప్రాతిపదికన తమ హక్కును అడుగుతున్నామని, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదని స్పష్టం చేశారు.
తొక్కేయడం షబ్బీర్ తో నే ఆగిపోవాలి
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక సందర్భంగా 14శాతం ఉన్న తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న ముస్లిములు షబ్బీర్ అలీతోనే ఈ పరిస్థితి ఆగిపోవాలని, లేనిపక్షంలో ఈ పరిస్థితి మరింత ముదురుతుందన్నారు. ముస్లిం మైనారిటీకి చెందిన నాయకుడికి ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ముస్లిముల కారణంగానే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, తమ వర్గానికి ఒక ఎమ్మెల్సీ ఇవ్వల్సిందేనని అంటున్నారు.
శ్రేణుల్లో నైరాశ్యం
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ జిల్లాలో ఒక రకమైన రాజకీయ కల్లోల పరిస్థితిని ఎదుర్కొంటోంది. శాసన సభ ఎన్నికల విజయం మూణ్ణాళ్ల ముచ్చటే అవుతోందని ఆ పార్టీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి కోసం ఎదురు చూస్తూనే ఉండగా, కామారెడ్డి నుంచి వచ్చి నిజామాబాద్ అర్బన్ లో పోటీ చేసిన మరో సీనియర్ షబ్బీర్ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టాలని చూశారు. కానీ ఇద్దరి కలలు ఫలించడం లేదు. ఇటు నామినేటెడ్ పదవుల భర్తీ లేదు.. అటు స్థానిక సంస్థల ఎన్నికల ఊసేలేదు. వెరసి పార్టీ శ్రేణుల్లో ఒక విధమైన నైరాశ్యం అలుముకుంది.
బీజేపీ దూకుడు
పసుపు బోర్డు, నవోదయ, రైల్వే ఓవర్ బ్రిడ్జీ, జక్రాన్ పల్లి ఎయిర్ పోర్టు తదితర అంశాలను కేంద్రంగా చేసుకుని జిల్లా బీజేపీ దూకుడు పెంచింది. నవోదయను కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అడ్డుకుంటున్నారని, కేంద్రం నుంచి తాము తీసుకొచ్చిన పెద్ద ప్రాజెక్టులను ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే భూపతిరెడ్డి సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని ఎత్తిచూపుతున్నారు. బీజేపీని దీటుగా ఎదుర్కోవడంలో తమ పార్టీ ఒక విధంగా వెనుకబడిపోతోందని కాంగ్రెస్ శ్రేణులే పేర్కొంటున్నాయి. ఇటీవల వెలువడిన పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలూ నిరాశనుమిగిల్చాయి. ఇదిలా ఉండగా నిజామాబాద్ జిల్లా నుంచి పట్టభద్రుల నియోజకవర్గం ఓట్లు బీజేపీకి 85శాతం పోలవడం కాంగ్రెస్ ను డిఫెన్స్ లో పడేసింది.