నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మినిస్టీరియల్ స్టాఫ్ రాష్ట్ర అధ్యక్షులుగా నిజామాబాద్ జిల్లావాసి, సిరిసిల్ల బీసీడీఓ సీనియర్ అసిస్టెంట్ హెచ్. రేవంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్ లోని నాంపల్లిలోగల టీఎన్జీఓ సెంట్రల్ యూనియన్ సమావేశ మందిరంలో శనివారం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల పర్యవేక్షకులుగా గ్రేటర్ హైదరాబాద్ టీఎన్జీఓ అధ్యక్షులు శ్రీకాంత్ వ్యవహరించారు. మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకు రేవంత్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఆయన ప్రకటించారు. అలాగే యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఖమ్మం జిల్లాకు చెందిన ఏవో చంద్ర శేఖర్, కోశాధికారిగా హైదరాబాద్ కమిషనరేట్ ఏవో పద్మావతి, అసోసియేట్ అధ్యక్షులుగా హైదరాబాద్ కమిషనరేట్ ఏవో సురేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఖలీద్, సురేష్, పాండురంగం, అంజన్ రాజు, షేక్ ఫర్జానా, శ్రీకర్ నియమితులయ్యారు. అనంతరం శాఖ పరమైన సమస్యలు, డిమాండ్లపై చర్చించి, సమస్యల పరిష్కారానికి కదలాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మినిస్టీరియల్ స్టాఫ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన రేవంత్ ను గ్రేటర్ హైదరాబాద్ టీఎన్జీఓ అధ్యక్షులు శ్రీకాంత్ అభినందించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర టీఎన్జీఓ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ..తన ఎన్నికకు సహకరించిన టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్, గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మినిస్టీరియల్ స్టాఫ్ నాయకులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.