. . . ముగ్గురిని పట్టుకున్న పోలీసులు
. . . 91 వేల నకిలీ కరెన్సీ స్వాధీనం
పిట్లం, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లాలో నకిలీ కరెన్సీని చెలామణి చేస్తున్న మహారాష్ట్రకు చెందిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ విఠల్ రెడ్డి మాట్లుడతూ కామారెడ్డి జిల్లా పిట్లం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెట్రోల్ బంక్ లో కొన్ని రోజుల క్రితం మహారాష్ట్రకు చెందిన నలుగురు పెట్రోల్ పోయించుకుని రూ.2 వేల నకిలీ కరెన్సీని క్యాషియర్ కు అందజేశారు. వాటిని పరిశీలించిన క్యాషియర్ అవి నకిలీ నోట్లుగా గుర్తించి నిలదీయగా నలుగురు కారులో పరారీ అయ్యారు. క్యాషియర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు తన పర్యవేక్షణలో బాన్సువాడ సిఐ తిరుపతయ్య, పిట్లం ఎస్సై ఆంజనేయులు మూడు టీంలతో గాలింపు చర్యలు చేపట్టారన్నారు. నకిలీ కరెన్సీ కోసం హైదరాబాద్ కు వెళ్తుండగా ధర్మారం టోల్ ఫ్లాజ్ వద్ద ఎంహెచ్ 38వి 2837 కారులో ప్రయాణిస్తున్న మహారాష్ట్రలోని పర్బానీ జిల్లా బాబూల్ గావ్ కు చెందిన రాహుల్ రావ్ సాహెబ్, ప్రతీక్, డానోబా డాల్ వే, టాక్లీ దోవాడే గ్రామానికి చెందిన బీమ శంకర్ రావులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.500 నోట్లను మొత్తం 91 వేల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి నకిలీ కరెన్సీని లక్షకు రెండు లక్షలు తీసుకుని సంబంధిత ముఠా చెలామణి చేస్తుందని తెలిపారు. నకిలీ కరెన్సీని సరఫరా , చెలామణి చేస్తున్న వారిని ఉపేక్షించేది లేదని డీఎస్పీ తెలిపారు. కేసును విజయవంతంగా చేదించిన బాన్సువాడ రూరల్ సిఐ తిరుపతయ్య, పిట్లం ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది శైలేష్, రాము, వెంకటేశ్ లను జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారని డీఎస్పీ తెలిపారు.
