కరీంనగర్, బతుకమ్మ : మొంథా తుపాను కారణంగా రైతులు దారుణంగా నష్టపోయారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కరీంనగర్ జిల్లా లోని తిమ్మాపూర్ మండలం మక్తాపల్లి గ్రామంలో శుక్రవారం ’జాగృతి జనం బాట‘లో భాగంగా తుపానుతో నష్టపోయిన పంటలను స్థానిక రైతులతో కలిసి కవిత పరిశీలించారు. ఈసందర్భంగా కవిత మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడిగా కొనుగోళ్లు చేయటం లేదన్నారు. వర్షాల కారణంగా రైతు పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. మానవతా దృక్పథంతో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలన్నారు. ఎకరాకు రూ. పదివేలు పరిహారం ఇస్తామంటే ఏ మూలకు సరిపోదని, రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వర్షాల కారణంగా ధాన్యానికి మెులకలు వస్తున్నాయని, ఇలాంటి సందర్భంలో తేమ శాతం 17 కన్నా తక్కువ ఉండాలని మిల్లర్లు కండిషన్లు పెడుతున్నారని ఇది సాధ్యపడదన్నారు. ఇప్పటి వరకు అసలు కొనుగోలు కేంద్రాలే ఎందుకు ప్రారంభించలేదని కలెక్టర్ ప్రశ్నించారు. ఐకేపీ సెంటర్లు లేకుండా డైరెక్ట్ గా ధాన్యం మిల్లర్లే కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారని పేర్కొన్నారు. ఐకేపీ సెంటర్ల నుంచి మిల్లర్ల వద్దకు ధాన్యం తీసుకెళ్లేందుకు రైతులకు అదనంగా ఖర్చు అవుతోందన్నారు. తేమ శాతం ఎక్కువ ఉన్న, బూజు పట్టిన, మొలకలు వచ్చిన సరే ధాన్యం కొనుగోలు చేసేలా మిల్లర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని కోరారు. భూమి దస్తావేజులు లేవంటూ కౌలు రైతుల ధాన్యం కొంటలేరని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. రైతులను ఇబ్బంది పెట్టటం సరికాదని, ధాన్యం కొనేలా వెసులుబాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలన్నారు. వర్షాల కారణంగా చాలా జిల్లాల్లో వరి మొత్తం ఒరిగిపోయిందని, అసలు కోసే పరిస్థితి కూడా లేదన్నారు. ఇప్పటి వరకు పంట నష్టం అంచనా వేయలేదని, ప్రభుత్వం, కలెక్టర్, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు?. వెంటనే ఫీల్డ్ లోకి వచ్చి పంట నష్టం అంచనా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీహర్ లో ఎన్నికల కారణంగా కూలీలు రావటం లేదని, దీంతో రైతులు అదనపు కూలీ చెల్లించాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం ఇస్తామన్న బోనస్ ఇవ్వలేదన్నారు. రైతుకు అన్ని రకాలుగా దెబ్బ మీద దెబ్బ తగులుతోందన్నారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు.


