వినూత్న పద్ధతిలో పంటలు సాగు చేయాలి
జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ సలహా కమిటీ సభ్యుడు కోటపాటి నరసింహనాయుడు
వేల్పూర్, బతుకమ్మ : రైతులు భూసార పరీక్షలు చేయించుకోని, నూతన పద్ధతుల్లో సాగు చేయాలని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ సలహా కమిటీ సభ్యుడు కోటపాటి నరసింహనాయుడు పేర్కొన్నారు. మంగళవారం అంక్సాపూర్ గ్రామంలో జరిగిన రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆయిల్ ఫామ్ పంట ద్వారా దీర్ఘకాలిక ఆదాయం పొందడం, ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల సలహాలు పాటించి, రసాయనిక, పురుగుల మందులను తగ్గిస్తూ ఆరోగ్యకరమైన దిగుబడిని సాధించడానికి కృషి చేయాల్సిందిగా రైతులకు వివరించారు. రైతులు తరచుగా రుద్రూర్, రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయలను సందర్శించి వ్యవసాయ పరిశోధనలను అధ్యయనం చేయాల్సిందిగా కోరారు. రుద్రూర్ కృషి విజ్ఞాన్ కేంద్రం అధికారి ఆకుల దినేష్ మాట్లాడుతూ భూసార పరీక్షలు జరిపించుకొని తగిన మోతాదులో మాత్రమే రసాయన ఎరువులను మాత్రమే వాడాలని సూచించారు. పచ్చి రొట్టతో రసాయనిక ఎరువుల అవసరం తగ్గించవచ్చని వివరించారు. మండల వ్యవసాయ అధికారి శృతి మాట్లాడుతూ తాము రికమండేషన్ చేసిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేసి రసీదులు తప్పనిసరిగా తీసుకొని భద్రపరుచుకోవాలని రైతులను కోరారు. వెటర్నరీ డాక్టర్ సంతోష్ రెడ్డి పశుపోషణ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. బీజేపీ సీనియర్ నాయకుడు రుక్మాజీ పాల్గొన్నారు.
