ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశాలకు విస్తృత ఏర్పాట్లు

0 9,847

 

. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 2 న జిల్లాలో నియోజకవర్గ స్థాయిలో సమావేశాలను అట్టహాసంగా నిర్వహించేలా విస్తృత ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకున్నామని అన్నారు.

శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణ అమలు, నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ, ధాన్యం సేకరణ, డివిజనల్ స్థాయిలో ప్రజావాణి నిర్వహణ అంశాలపై సమీక్ష నిర్వహించారు.

 

Extensive arrangements for constituency level meetings of the Public Administration Progress Plan

 

వీ.సీ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులతో సమావేశం నిర్వహించి, పై అంశాల అమలు తీరుపై సూచనలు చేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చివరి వరకూ పక్కాగా అమలు చేయాలని సూచించారు. గ్రామ, మండల స్థాయి తరహాలోనే శనివారం నాటి నియోజకవర్గ స్థాయి సభలను కూడా విజయవంతంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఉదయం వేళలోనే సభలు నిర్వహించాలని సూచించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ స్థాయి సభను శ్రీ రామా ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ సభను నడిపల్లి వద్ద గల జీ. కన్వెన్షన్ లో, ఆర్మూర్ నియోజకవర్గ స్థాయి సభను సప్తగిరి ఫంక్షన్ హాల్ లో, బోధన్ నియోజకవర్గ స్థాయి సభను ఆచన్ పల్లి లోని ఏ.ఆర్ గార్డెన్ లో నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 4 నుండి 9వ తేదీ వరకు రైతు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

 

Extensive arrangements for constituency level meetings of the Public Administration Progress Plan

 

ఇదిలాఉండగా, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ సక్రమంగా కొనసాగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ట్యాబ్ ఎంట్రీలు, రవాణా, గోనె సంచుల సరఫరా, హార్వెస్టర్ యంత్రాల వినియోగం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, సకాలంలో ధాన్యం సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం దోహదపడుతున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రెవెన్యూ డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టర్, ఆర్డీఓల నేతృత్వంలో ప్రతీ సోమవారం పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు స్వీకరించిన నెల రోజులలోగా పరిష్కరించాలని, తిరస్కరణకు గురైతే అందుకు గల కారణాలతో దరఖాసుదారుకు సమాచారం అందించాలని అన్నారు. ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల సంబంధిత వివరాలను పోర్టల్ లో నమోదు చేసి రసీదు అందించాలని, దరఖాస్తుదారులు ప్రజావాణి పోర్టల్ లో తమ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చని అన్నారు. దరఖాస్తులు సమర్పించడానికి వచ్చే ప్రజలకు త్రాగునీరు, కుర్చీలు, అత్యవసర వైద్య సేవలను అందుబాటులో ఉంచాలని తెలిపారు.

 

Extensive arrangements for constituency level meetings of the Public Administration Progress Plan

 

ఈ నెల 3వ తేదీన  జరగనున్న నీట్ ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. అభ్యర్థుల హాజరును బయోమెట్రిక్ విధానం ద్వారా తీసుకోవడం జరుగుతుందని, పరీక్ష కేంద్రంలోనికి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అనుమతించడం జరగదని, పరీక్ష రాసే అభ్యర్థుల తనిఖీ సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.

జనగణన ప్రక్రియకు సంబంధించి, ఈ నెల 10వ తేదీ వరకు జరగనున్న స్వీయ గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వీయ నమోదు చేసుకునేలా చూడాలన్నారు. అన్ని శాఖల అధికారులు స్వీయ గణన చేసుకుని, తమ శాఖ సిబ్బంది సైతం చేసుకునేలా చూడాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, యువత కూడా స్వీయ గణన చేసుకునేలా అవగాహన కల్పించాలని, టామ్ టామ్, దినపత్రికలు, ఛానల్ ద్వారా ప్రజలందరికీ తెలిసే విధంగా విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. 33 ప్రశ్నలకు సరైన సమాధానం అందించాలని, స్వీయ గణన ప్రక్రియ అనంతరం వచ్చిన సంఖ్యను భద్రపరచుకుని గణన అధికారులు ఇంటికి వచ్చిన సమయంలో అందించేలా ప్రజలకు వివరించాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్ డీపీఓ శ్రీనివాస్ రావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.