23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

పాఠశాలలో కనీస వసతులు కూడా అందుబాటులో లేవు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నగరంలోని దుబ్బ పాఠశాలలో సుమారు 450 మంది విద్యార్థులు చదువుతున్నప్పటికీ కనీస మౌలిక వసతులు కూడా అందుబాటులో లేవని ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలోని దుబ్బ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఐద్వా (అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం) జిల్లా నాయకులు సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ వర్షం పడినప్పుడు పాఠశాల ఆవరణ మొత్తం బురదమయంగా మారి విద్యార్థులు నిలబడలేని పరిస్థితి నెలకొంటోందని తెలిపారు. పాఠశాలలో కేవలం రెండు మరుగుదొడ్లు మాత్రమే ఉండటంతో ముఖ్యంగా బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మరుగుదొడ్లు సరిపోక కొందరు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చెప్పారు. బాలురకు ప్రత్యేక మరుగుదొడ్లు లేకపోవడంతో ప్రహరీ గోడల వద్దకు వెళ్లాల్సి వస్తోందని, దీనిపై సమీప నివాసితులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని విద్యార్థులు తెలిపినట్లు వివరించారు.

 

Even basic amenities are not available in the school.

 

అలాగే తరగతి గదుల్లో నేల టైల్స్ పగిలిపోయాయని, ఫ్యాన్లు లేకపోవడం, బెంచీలు, టేబుళ్లు దెబ్బతినడం, చిరిగిపోయిన పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడం వంటి సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థులకు యూనిఫాంలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో అందలేదని, అందిన వాటిలో కూడా నాణ్యత లోపించిందని ఆరోపించారు. యూనిఫాం ధరించకపోతే కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థులను మందలించి ఇంటికి పంపిస్తున్నారని తెలిపారు. పాఠశాలలో తాగునీటి సౌకర్యం కూడా సరిగా లేదని, బోరు నీటిని తాగేందుకు చిన్నపిల్లలు, పెద్దపిల్లలు ఒకేచోట క్యూలో నిలబడాల్సి వస్తోందని చెప్పారు. దీంతో పలువురు విద్యార్థులు ఇంటి నుంచే నీటి సీసాలు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బాలికలకు గతంలో ప్రభుత్వం అందించాల్సిన శానిటరీ ప్యాడ్లు ప్రస్తుతం అందడం లేదని, దీంతో ఉపాధ్యాయులే తమ సొంత డబ్బుతో వాటిని కొనుగోలు చేసి విద్యార్థినులకు అందిస్తున్నారని వెల్లడించారు. పాఠశాలలో ఆయమ్మలు ఉన్నప్పటికీ తరగతి గదులు, ప్రాంగణాన్ని శుభ్రం చేసే పనులు విద్యార్థులకే అప్పగిస్తున్నారని, రోజూ రోల్ నంబర్ల వారీగా విద్యార్థులే ఊడ్చి చెత్తను తొలగించాల్సి వస్తోందని విద్యార్థులు వాపోయారని తెలిపారు. మధ్యాహ్న భోజనంలో పురుగులు, రాళ్లు, వెంట్రుకలు, కాంచి ముక్కలు, రబ్బర్ బ్యాండ్లు వంటి అపరిశుభ్రమైన వస్తువులు కనిపిస్తున్నాయని, దీంతో చాలామంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయడానికి భయపడుతున్నారని, కొందరు భోజనం చేయడం మానేశారని పేర్కొన్నారు. ఈ సమస్యలన్నింటినీ విద్యాశాఖ అధికారులు వెంటనే పరిశీలించి పరిష్కరించాలని, లేనిపక్షంలో ఐద్వా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఎ. అనిత, నగర నాయకురాలు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

 

Even basic amenities are not available in the school.

More articles

Latest article