29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రజాస్వామ్య హక్కులు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.అనిల్ కుమార్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

దేశంలో ప్రజాస్వామ్య హక్కులు రోజురోజుకూ క్షీణిస్తున్నాయని పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.అనిల్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన నిరసన దీక్షకు సంఘీభావంగా నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ శాస్త్రవేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్ యూ) నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. అనిల్ కుమార్, నగర అధ్యక్షుడు నసిర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతుల్లో తమ సమస్యలను తెలియజేస్తున్న విద్యార్థులు, యువత, మేధావులపై కేసులు నమోదు చేయడం, అరెస్టులతో ఉద్యమాలను అణచివేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని వారు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు నెల రోజులుగా ఢిల్లీలో శాంతియుతంగా నిరసన కొనసాగిస్తున్నప్పటికీ, వారి సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని పీడీఎస్ యూ నాయకులు అన్నారు. విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా నిరాహార దీక్ష చేపట్టిన సోనమ్ వాంగ్‌చుక్‌ను అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ నగర సహాయ కార్యదర్శి సృజన్, తెలంగాణ యూనివర్సిటీ నాయకులు నితిన్, హేమాంజలి, శ్రీశాంత్, భాను, అర్జున్, హర్షితతో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

 

Democratic rights are eroding day by day.

More articles

Latest article