. . . నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
. . . సీసీ కెమెరా నీడలో పరీక్షలు
. . . జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
2025-26 విద్యా సంవత్సరం వార్షిక పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్ మెంటల్ అధికారులదే ప్రముఖ పాత్ర అని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఇంటర్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంటుందని జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం నిజామాబాద్ బాలుర (ఖిల్లా) జూనియర్ కళాశాలలో ఉదయం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్ మెంటల్ అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ జిల్లాలో 58 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇంటర్ బోర్డు కమిషనర్, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని తెలిపారు. పరీక్షల నిర్వహణ లో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇంటర్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాల్లో వెంటనే సీ.సీ. కెమెరాలు పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రశ్న పత్రాల బండిల్ లను సి.సి. కెమెరాల ముందే ఓపెన్ చేయాలని ఆదేశించారు. అందరూ సమయ పాలన పాటించాలని, పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు వెంటనే సమకూర్చాలని ఆదేశించారు. సెల్ ఫోన్ లను ఎట్టి పరిస్థితిలో పరీక్ష కేంద్రంలో అనుమతించే ప్రసక్తే లేదని, సి.ఎస్, డి. ఓ.లు కూడా పరీక్ష జరుగుతున్న సమయంలో పోలీస్ కస్టడీలోనే ఉంచాలని అన్నారు. పరీక్షల నిర్వహణకు ముందే ఇన్విజిలేటర్ ల సమావేశం నిర్వహించి తగిన నియమ నిబంధనలు వివరించాలని ఆదేశించారు. ప్రతి రోజు ఫ్లయింగ్, సిట్టింగ్, ఇంటర్ బోర్డు స్క్వాడ్ లతో పాటు జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు, హై పవర్ కమిటీ అన్ని పరీక్షా కేంద్రాలను తనిఖి చేస్తారని, విద్యార్థిని, విద్యార్థులను పరీక్షా హాలు లోకి పంపే ముందే క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ, విద్యా శాఖ, విద్యుత్, ఆర్టీసీ, హెల్త్, పోస్టల్, పోలీస్ అధికారులతో ఇదివరకే సమన్వయ సమావేశం జరిగిందని, పరీక్ష కేంద్రాల వారీగా సంబంధిత స్థానిక అధికారులకు తగిన ఏర్పాట్ల కోసం లెటర్ లు రాయాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు ముందు, పరీక్ష జరుగుతున్న సమయంలో, పరీక్ష పూర్తయిన తరువాత తీసుకోవలసిన చర్యలను పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు నుస్రత్ జహాన్, రజియుద్ధిన్న్ అస్లాం, రజియా సుల్తానాలు తెలియజేశారు. సమావేశంలో హై పవర్ అధికారి కైసర్ పాషా, బల్క్ అధికారి చిన్నయ్య, బాలుర (ఖిల్లా) జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఖాలిక్ లు సి.ఎస్, డి. ఓలకు పరీక్షల నిర్వహణ బాధ్యతలను వివరించారు.
