. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల వివరాలను పొందుపరుస్తూ ఆయా శాఖల వారీగా నివేదికలు సమర్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం అన్ని శాఖల అధికారులు, ఆయా మండలాల ఎంపీడీఓలు, తహసిల్దార్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల నిర్వహణ తీరును పర్యవేక్షించి, తగిన దిశా నిర్దేశం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతి జిల్లాకు స్పెషల్ ఆఫీసర్లను నియమించిందని అన్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు స్పెషల్ ఆఫీసర్ గా నియమితులైన రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, సీనియర్ ఐ.ఏ.ఎస్ డాక్టర్ యోగితారాణా త్వరలోనే జిల్లాకు విచ్చేసి ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల అమలును సమీక్షించడం జరుగుతుందన్నారు.

దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయా శాఖల ఆధ్వర్యంలో గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో, వార్డులు, మున్సిపల్ పట్టణాల వారీగా నిర్వహించిన గ్రామ సభలు, ఇతర కార్యక్రమాల వివరాలను తెలియజేస్తూ సోమవారం సాయంత్రం లోపు సమగ్ర నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో నిర్దేశించిన అంశాలతో పాటు కొత్తగా వినూత్న రీతిలో ట్రాన్స్ జెండర్ల నిషేధంపై సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించడం, మారుమూల పల్లెలకూ ఆర్టీసీ బస్సు సర్వీసుల విస్తరణ, శ్రమదానం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు విస్తృత స్థాయిలో చేరవేసేందుకు సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ల సేవలను వినియోగించుకోవడం వంటి వినూత్న కార్యక్రమాలను కూడా జిల్లాలో నిర్వహించడం జరిగిందని కలెక్టర్ గుర్తు చేశారు. వాటి వివరాలను కూడా నివేదికలో పొందుపరచాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రగతి ప్రణాళిక సభల నిర్వహణ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన అభ్యర్థనలు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు, వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఆయా వర్గాల వారికి చేకూర్చిన లబ్ది గురించి నివేదికల్లో వివరాలు పొందుపరచాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీ.ఈ.ఓ సాయాగౌడ్, డీ.ఆర్.డీ.ఓ సాయన్న, డీ.ఈ.ఓ అశోక్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

