29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

గోదావరి పుష్కరాలు – 2027 కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రాష్ట్ర డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

గోదావరి పుష్కరాలు – 2027ను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని పోలీస్ యూనిట్లు ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్ ఆదేశించారు. గోదావరి పరివాహక ప్రాంతాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ లో ఆయన పుష్కరాల ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నిర్వహణ, అత్యవసర సేవల సమన్వయం, విపత్తు నిర్వహణ, కమ్యూనికేషన్ వ్యవస్థల బలోపేతం వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రెంజల్, మెండోరా, ఏర్గట్ల పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఉన్న పుష్కర ఘాట్ల వద్ద చేపడుతున్న ఏర్పాట్లపై ప్రత్యేకంగా సమీక్షించారు.

 

Comprehensive arrangements must be made for the 2027 Godavari Pushkaram.

 

భక్తుల భద్రత దృష్ట్యా తాత్కాలిక పోలీస్ అవుట్‌పోస్టుల ఏర్పాటు, ఆధునిక సౌకర్యాలతో కమాండ్ అండ్ కంట్రోల్ హాల్ నిర్మాణం, సీసీటీవీ కెమెరాల విస్తరణ, డ్రోన్ నిఘా, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, బ్యారికేడింగ్, పార్కింగ్ ప్రణాళిక, ట్రాఫిక్ మళ్లింపు మార్గాల రూపకల్పనతో పాటు మహిళలు, చిన్నారులు, వృద్ధుల కోసం ప్రత్యేక సహాయక కేంద్రాల ఏర్పాటుపై అధికారులు చేపడుతున్న చర్యలను పరిశీలించారు. అదేవిధంగా భారీగా వచ్చే భక్తుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు క్యూ లైన్ నిర్వహణ, విపత్తు నిర్వహణ బృందాల సిద్ధత, అగ్నిమాపక, వైద్య, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో సమన్వయం, తాగునీరు, లైటింగ్, పారిశుద్ధ్య సదుపాయాలు, తప్పిపోయిన వారి కోసం ప్రత్యేక కేంద్రాలు, సమాచార వ్యవస్థల బలోపేతంపై కూడా విస్తృతంగా చర్చించారు. అన్ని శాఖలతో సమన్వయం పెంచుకుని భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన పుష్కరాలను అందించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని డీజీపీ మహేష్ భగవత్ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌ లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్.శుభం ప్రకాశ్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, మల్లేష్, గోదావరి పరివాహక ప్రాంతాల సీఐలు, ఎస్‌ఐలు, ఆఫీస్ సూపరింటెండెంట్ శంకర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

 

Comprehensive arrangements must be made for the 2027 Godavari Pushkaram.

More articles

Latest article