- వారం గడువులో డిఈఈకి నివేదిక
- ఆదేశాలు జారీ చేసిన ఎస్ఈ రవీందర్
నిజామాబాద్, బతుకమ్మ: ఆర్మూర్ డివిజన్ లో సీనియారిటీ జాబితాను సరిచేసేందుకు గాను కమిటిని ఎస్ఈ రవీందర్ సోమవారం ఏర్పాటు చేసారు. ఈ బృందం వారం రోజుల్లో జాబితాపై అద్యాయనం చేయడమే గాకుండా, వాటిని సరి చేసి ఆర్మూర్ డివిజన్ డిఈఈకి అందజేయాలి. కమిటీకి చైర్మెన్ గా ఎస్ఎఓ శ్రీనివాస్, సభ్యులుగా మోర్తాడ్ ఎఓ పురుషోత్తం, ఎడిఎం పిఓ శ్రీధర్, ఆర్మూర్ ఎడిఈ కృష్ణను నియమించారు.
- సీనియారిటీ లో తప్పులు:
గత కొన్నేళ్ళుగా నచ్చిన వారికి పదోన్నతులు కల్పించారు. డిచ్ పల్లి డివిజన్ కోసం అప్సన్స్ పెట్టుకున్న వారి జాబితా ప్రకటించాకనే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తమకన్న కింద ఉన్న వారు ఉన్నట్టుండి ముందుకు ఎలా వెళ్తారని సిబ్బంది నుంచి ఆక్షేపణలు వచ్చాయి. దీంతో డివిజన్ కు కేటాయింపును తాత్కాలికంగా నిలిపివేశారు. ఆర్మూర్ డివిజన్ లో పదోన్నతులు తీసుకున్నవారి జాబితాను కార్యాలయంలో ప్రదర్శనకు ఉంచాలని కొన్ని సంఘాల నాయకులు చాలా కాలంగా కోరుతూ వస్తున్నారు. డివిజన్ విభజన ప్రక్రియ కొనసాగుతుండడంతో అదే క్రమంలో సిబ్బంది కేటాయింపు పనులు మొదలయ్యాయి. ఈ సమయంలోనే జాబితాలో అవకతవకలు జరిగాయని గమనించారు. నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్ ల నుంచి ఆప్షన్స్ అడిగారు. ఆర్మూర్ డివిజన్ లోని జాబితాలో ఎక్కువగా తప్పులు ఉన్నట్లు గ్రహించిన సిబ్బంది ముందుగా సీనియారిటీని సరి చేయాలనే డిమాండ్ అధికారుల ముందు ఉంచారు. దీనిని సరి చేసేందుకు కమిటిని వేయాల్సి వచ్చిందని ఎస్ఈ తెలిపారు.
