నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న 46 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ సర్వేయర్ల కొరతను అధిగమించేందుకు లైసెన్స్డ్ సర్వేయర్లకు ప్రభుత్వం శిక్షణ ఇప్పించి, వారి సేవలను వినియోగించుకునేలా చర్యలు తీసుకుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని లైసెన్సుడ్ సర్వేయర్లు బాధ్యతాయుతంగా సేవలు అందించాలని సూచించారు. ఎలాంటి అవినీతి ఆరోపణలకు తావు లేకుండా నిజాయితీగా సర్వే నివేదికలు సమర్పించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏ.డీ అశోక్ తదితరులు పాల్గొన్నారు.


