. నమ్మక ద్రోహం చేశారు.. నిద్ర లేకుండా చేస్తాం
. మాదిగలను మోసం చేస్తే భారీ మూల్యం తప్పదు
. ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం
. నిజామాబాద్ నుంచి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం
. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక, జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణను స్వాగతించిన సీఎం రేవంత్ రెడ్డి దానిని అమలు చేయకుండా తొక్కి పెడుతున్నారని ఎమార్పీఎస్ వ్యవస్థాపక, జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని శ్రావ్య గార్డెన్స్ లో బుధవారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్, ఎంస్ పీ అనుబంధ విభాగాల రాష్ర్ట కార్యవర్గ సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. నమ్మక ద్రోహానికి గురైన మాదిగలు ఎంతటి త్యాగలకైనా వెనుకాడరని, మాదిగలను మోసం చేసిన వారు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం చేసిన పోరాటాలు.. వర్గీకరణ అమలు కోసం పునరావృతమవుతాయని, మాదిగ జాతి పోరాటాలకు సిద్ధమవుతోందని, ప్రభుత్వం సిద్ధంగా ఉండాలన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం లో తీసుకునే నిర్ణయాలపైనే భవిష్యత్ కార్యాచరణ ఆధారపడి ఉంటుందని తెలిపారు. రేవంత్ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ కోసం జరిగిన అన్ని పోరాటాల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని అందరినీ నమ్మించారని, ఇప్పుడు వర్గీకరణను అమలు చేయడం లేదన్నారు. వర్గీకరణ అమలుపై పాలకులే కుట్ర చేస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో వికలాంగుల, వృద్ధుల, వితంతుల పింఛన్లు పెంచుతామని హామీలు ఇచ్చి ఇప్పుడు పెంచకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. 30 ఏళ్లపాటు పోరాటం చేసిన చరిత్ర మందకృష్ణ మాదిగకే దక్కిందన్నారు. వర్గీకరణ కోసం ఈ సమయంలో మందకృష్ణ మాదిగకు తెలంగాణలోని ఎమ్మార్పీఎస్, ఎంఎస్ పీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ వెన్నంటి ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంఎస్ పీ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేశ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ప్రమోద్ మాదిగ, ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షుడు సరికెల పోశెట్టి, వీహెచ్ పీఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ, ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు మైలారం బాలు, మాదిగ ఉద్యోగుల జాతీయ నాయకులు తెడ్డు గంగారాం మాదిగ, సురేశ్ మాదిగ, మైలారం గంగాధర్, మారుతి, గద్దల రమేశ్, సూరజ్, లక్ష్మీగారి భూమయ్య, మహేశ్ మాదిగ, ప్రవీణ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
