నిజామాబాద్, బతుకమ్మ : భూ భారతి పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులలో భాగంగా గురువారం నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం దూదిగాం, సోన్ పెట్ గ్రామాలలో నిర్వహించిన సదస్సులలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. సదస్సుకు హాజరైన రైతులతో భేటీ అయ్యి, వారు ఎదుర్కొంటున్న భూ సంబంధిత సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, దరఖాస్తుల స్వీకరణ కౌంటర్ వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలన జరిపి, అధికారులకు సూచనలు చేశారు. ఒకే దరఖాస్తులో రైతులు రెండు, మూడు రకాల భూ సమస్యలను పేర్కొనే సమయంలో వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ఆన్లైన్ లో జాగ్రత్తగా ఎంట్రీ చేయాలని అన్నారు. వివరాల నమోదులో తప్పిదాలకు ఆస్కారం కల్పించకూడదని, ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని డేటా ఎంట్రీ ఆపరేటర్లకు హితవు పలికారు. దరఖాస్తుల పరిశీలన ఆన్లైన్ నమోదు ప్రక్రియలపై పరిపూర్ణమైన అవగాహన ఏర్పర్చుకోవాలని అన్నారు. భూ రికార్డులలోని వివరాలను పక్కాగా సేకరిస్తూ, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం 18 రాష్ట్రాలలో సమగ్ర అధ్యయనం జరిపి, నూతన ఆర్.ఓ.ఆర్ చట్టం అమలులోకి తెచ్చిందని అన్నారు. ప్రస్తుతం పైలెట్ ప్రాతిపదికన మెండోరా మండలంలోని ఆయా గ్రామాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల సందర్భంగా వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నిర్ణీత గడువు లోపు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. వివిధ కారణాల వల్ల రెవెన్యూ సదస్సులో అర్జీలు సమర్పించే అవకాశం లభించని వారు తరువాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, అధికారులు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. ధరణి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చని అన్నారు. భూ రికార్డులలో పేరు తప్పుగా ఉండడం, విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావంలో మార్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నెంబర్ మిస్సింగ్, పట్టా పాస్ బుక్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్-బి లో చేర్చిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులు తదితర వాటికి సంబంధించిన దరఖాస్తులు స్వీకరించి భూభారతి చట్టంలో పొందుపర్చిన మార్గదర్శకాల ప్రకారం పరిష్కరించేలా రెవెన్యూ బృందాలకు మార్గనిర్దేశం చేశామని కలెక్టర్ తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద మెండోరా మండలంలో రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించిన మీదట, జిల్లాలోని మిగితా మండలాల్లో రెవెన్యూ గ్రామాల వారీగా సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకుని భూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సదస్సులలో ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, తహశీల్దార్ సంతోష్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

