. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఇతర రాష్ట్రాలు, జిల్లాలు లేదా ప్రాంతాల నుండి వచ్చి పని చేసుకునే కార్మికులు, అద్దెదారులు, ఉద్యోగుల విషయంలో గృహ యజమానులు, వ్యాపార సంస్థలు, కాంట్రాక్టర్లు, యాజమాన్యాలు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సూచించారు. వారి పూర్తి వివరాలు సేకరించడం ద్వారా భద్రతా పరమైన సమస్యలను ముందుగానే గుర్తించి నివారించవచ్చని శనివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధి కోసం వచ్చే వ్యక్తుల పేరు, శాశ్వత చిరునామా, ఆధార్ కార్డు ప్రతులు, మొబైల్ నంబర్లు, కుటుంబ వివరాలు, పని చేసే స్థలం, వచ్చిన తేదీ వంటి వివరాలను తప్పనిసరిగా నమోదు చేసి తమ వద్ద భద్రపరచుకోవాలని సూచించారు. అవసరమైతే స్థానిక పోలీస్ స్టేషన్‌లో కూడా వారి వివరాలు నమోదు చేయించాలని తెలిపారు. అద్దె ఇళ్లలో నివసించే వారు, నిర్మాణ పనుల్లో పనిచేసే కార్మికులు, హోటళ్లు, లాడ్జీలు, పరిశ్రమలు, ఇతర వ్యాపార సంస్థల్లో పనిచేసే వారి వివరాలను యాజమాన్యాలు నిరంతరం పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా, వారి ప్రవర్తనలో మార్పులు గమనించినా, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం తెలిసినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. ప్రజల అప్రమత్తతతోనే నేరాలను అరికట్టడం, శాంతిభద్రతలను కాపాడడం సులభమవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించి సమాజ భద్రతకు తోడ్పడాలని అన్నారు.
