. . . జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు
కామారెడ్డి, బతుకమ్మ :
రైతు భరోసా విషయంలో పంటల భూముల సంబంధించి విధి విధానాల రూపకల్పనతో పాటు అవకతవకలు జరుగకుండా ప్రక్షాళన జరుగుతుంది. రాష్ట్రంలో మరో నాలుగు లక్షల మంది రైతులకు దీపావళి తర్వాత రుణమాఫీ చేస్తామని జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా మద్ది చంద్రకాంత్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ వేడుకలకు జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రభుత్వ సలహదారులు షబ్బీర్ ఆలీ, ఎంపీ సురేష్ షట్కార్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీల్లో గ్రంథాలయాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీకి పొద్దున లేస్తే కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. బిఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ఈ రోజు మేము ఏపని చేయాల్సి వచ్చేది కాదు అని, గత ప్రభుత్వ హయంలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది, సోనియా గాంధీది అని అన్నారు. తెలంగాణలోని గ్రాడ్యుయేట్ లందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని, మనకు రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని బిఆర్ఎస్ ఆర్థికంగా లూటీ చేసినా కాంగ్రెస్ పార్టీ ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ ముందుకు వెళ్తుందన్నారు.

సోషల్ మీడియా వేదికగా బిఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అన్ని రంగాలలో ప్రాధాన్యం కల్పిస్తుందని అన్నారు. ప్రజా పాలన కార్యక్రమం చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం జరుగుతుందని, ఎన్నికలలో ఇచ్చిన అన్ని గ్యారెంటీలను అమలు పరచడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 10 లక్షల వరకు ఆరోగ్య భీమా అందించడం జరుగుతుందని, రాబోవు రోజులలో జిల్లాలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు కూడా అందించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాష్ శ్రీనివాస్,మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి,సుభాష్ రెడ్డి తదితరులు ఉన్నారు.

