28.8 C
Hyderabad
Monday, August 3, 2026

తెలంగాణ జలసిరిపై రైతులకు అవగాహన కల్పించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎంపీడీవో అనంతరావు

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ జలసిరి’ కార్యక్రమంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని ఇందల్వాయి ఎంపీడీవో అనంతరావు సూచించారు. ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకునేలా రైతులను చైతన్యపరచాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ అధికారులపై ఉందని ఆయన తెలిపారు. మంగళవారం ఇందల్వాయి మండల కేంద్రంలోని రైతు వేదికలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం జల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, నీటి వనరుల పరిరక్షణకు గ్రామస్థాయిలో చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మండలంలోని ప్రతి గ్రామపంచాయతీలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించి, జల సంరక్షణ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎంపీడీవో ఆదేశించారు. ఇంకుడు గుంతలు, పంట కుంటలు, ఊట కుంటలు, బోరు బావుల రీచార్జ్ నిర్మాణాలు, కాలువల అభివృద్ధి వంటి నీటి సంరక్షణ చర్యలను గ్రామ ప్రజల భాగస్వామ్యంతో చేపట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల వద్ద ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు. ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సహకారంతో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. భూగర్భ జలాల పరిరక్షణకు ప్రజలు సహకరించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ జలసిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, మహిళా సంఘాల సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు సమన్వయంతో పనిచేయాలని ఎంపీడీవో అనంతరావు పిలుపునిచ్చారు.

 

Farmers should be made aware of 'Telangana Jalasiri'.

More articles

Latest article