నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
శ్రీ చైతన్య పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిపై దాడి చేసి చేతిని విరగగొట్టిన ఉపాధ్యాయుడు రవీందర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ నగర అధ్యక్షుడు అఖిల్ డిమాండ్ చేశారు. ఈ అంశమై తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఏఓ కి, డిఈఓ కి, రూరల్ టౌన్ ఎస్ ఐ కి బుధవారం మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ మరో నాలుగు రోజుల్లో 10వ తరగతి ఫైనల్ పరీక్షలు ఉండగా విద్యార్థి చేయి విరగొట్టి స్కూల్ యాజమాన్యం హాస్పిటల్ పాలు చేసిందని అన్నారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి దాడి చేసిన ఉపాధ్యాయుడు పై క్రిమినల్ కేసు అటెంప్ట్ టు మర్డర్ కింద కేసు నమోదు చేయాలని, బాధిత విద్యార్థికి న్యాయం చేయాలని కోరారు. అలాగే జిల్లాలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు సీబీఎస్ఈ పేరుతో తల్లిదండ్రులను మోసం చేస్తూ, సరైన అనుమతులు లేకుండానే అడ్మిషన్లు చేపడుతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కెవిన్ గౌరేష్, సురేష్, పునీత్, సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

